10, 16 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక టీకాలు

-డిసెంబరు 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం
-28 జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
డిఫ్తీరియా, ధనుర్వాతం వ్యాధుల నుంచి పిల్లలకు అదనపు రక్షణ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. డిసెంబరు 3 నుంచి 5వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో 10, 16 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలకు టీడీ టీకాలు వేయనున్నారు. ఈ వయసు పిల్లల్లో టీకాల కవరేజీని 95 శాతానికి మించి సాధించాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించింది. చిన్నతనంలో ప్రాథమిక టీకాల కార్యక్రమంలో భాగంగా వేసిన పెంటావాలెంట్‌ టీకాల ద్వారా లభించిన రక్షణను మరింత పెంచేందుకు ఈ అదనపు టీకాలు వేస్తారు. డిఫ్తీరియా, ధనుర్వాతం తీవ్రమైన అనారోగ్యానికి, ప్రాణాపాయానికి దారితీసే అంటువ్యాధులు కావడంతో యుక్తవయసులోనూ రక్షణ కల్పించడం అవసరమని శాఖ పేర్కొంది.

అర్హుల గుర్తింపునకు సర్వే

ప్రతి ఏఎన్‌ఎం తన పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలల జాబితాను సిద్ధం చేసి, టీకా తీసుకోవాల్సిన పిల్లల వివరాలను సేకరించాలి. ఇప్పటికే యూవిన్‌ పోర్టల్‌లో నమోదు కాని అర్హుల వివరాలను నమోదు చేయాలి. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లని పిల్లలను కూడా గుర్తించి జాబితాలో చేర్చాలి. 10 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలకు టీడీ 10, 16 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి టీడీ 16 టీకా వేయాలి. సాధారణ టీకాల కార్యక్రమంలో ఇప్పటికే సంబంధిత టీకా తీసుకున్న పిల్లలకు మరోసారి వేయకూడదు.

పాఠశాలల వారీగా కార్యాచరణ ప్రణాళిక

టీకా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ఏఎన్‌ఎంలు సూక్ష్మ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఇందులో పాఠశాల లేదా కళాశాల పేరు, గ్రామం, ఏఎన్‌ఎం, పిల్లలను సమీకరించే సిబ్బంది పేర్లు, అవసరమైన టీకాలు, వైద్య సామగ్రి, టీకాల పంపిణీ విధానం వివరాలు ఉండాలి. కార్యక్రమం కోసం యూవిన్‌ పోర్టల్‌లో అదనపు టీకా కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటి సమయాలను ముందుగానే నిర్ణయించాలి. టీకాల ప్రాధాన్యంపై వైద్యాధికారులు, పర్యవేక్షకులు, మధ్యస్థాయి ఆరోగ్య ప్రదాతలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలి.

ఇతర శాఖల సహకారంతో నిర్వహణ

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా టీకా అధికారులు, వైద్యాధికారులు మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలి. జిల్లా టీకాల కార్యాచరణ బృందం, మండల స్థాయి కార్యాచరణ బృందాల సమావేశాల ద్వారా సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలి.

టీకా కేంద్రాల్లో అత్యవసర ఏర్పాట్లు

ప్రతి టీకా కేంద్రంలో అవసరమైన టీకాలు, వైద్య సామగ్రి తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండాలి. టీకా అనంతరం తీవ్రమైన అలర్జీ వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే చికిత్స అందించేందుకు అన్‌ఫైలాక్సిస్‌ కిట్‌ తప్పనిసరిగా ఉంచాలి. ప్రతి టీకా కేంద్రాన్ని సమీపంలోని టీకా అనంతర ప్రతికూల ప్రభావాల నిర్వహణ కేంద్రంతో అనుసంధానించాలి.

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జిల్లా స్థాయి పరిశీలకులను నియమించాలి. జిల్లా టీకా అధికారులు, వైద్యాధికారులు, పర్యవేక్షకులు ప్రత్యేక టీకా కేంద్రాలను పరిశీలించి, నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలి. టీకాలు తీసుకున్న పిల్లల వివరాలను 24 గంటల్లోగా యూవిన్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. వారందరికీ డిజిటల్‌ టీకా ధ్రువపత్రాలు జారీ చేయాలి. ఆర్‌సీహెచ్‌, హెచ్‌ఎంఐఎస్‌ పోర్టళ్లలోనూ వివరాలను నమోదు చేయాలి. జిల్లాల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో రోజువారీ టీకా కవరేజీ నివేదికలను సేకరించి రాష్ట్ర టీకా అధికారికి పంపించాలి.

రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఈ ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే పిల్లలతో పాటు వాటికి వెళ్లని అర్హులైన పిల్లలందరికీ టీకాలు అందేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, జిల్లా టీకా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌ సంచాలకుడు కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.