19 నుంచి పి.బి. సిద్ధార్థలో వికసిత్ భారత్ అంతర్జాతీయ సదస్సు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ‘ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అసోసియేషన్’ సంయుక్త నిర్వహణలో  ‘వికసిత్ భారత్ @2047’ అంశంపై నవంబర్ 19 నుండి 21 వరకు మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేశ్ తెలిపారు. మంగళవారం ఉదయం కళాశాల బోర్డు రూమ్‌లో జరిగిన మీడియా సమావేశంలో సదస్సు పోస్టరును ఆయనతోపాటు డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్,  సదస్సు కన్వీనర్ ప్రొ. రాజేష్ సి. జంపాల, ఎకనమిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రొఫెసర్ అలోక్ కుమార్ విడుదల చేశారు “వికసిత్
భారత్ @2047:  మారుతున్న ప్రపంచంలో ఆర్థిక స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సుస్థిర అభివృద్ధి” అనే అంశంపై ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తారు. ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అసోసియేషన్ 7వ వార్షిక అంతర్జాతీయ సదస్సు ప్రారంభ సమావేశం  కానూరులోని పి.వి.పి. సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీలో, మిగిలిన మూడు రోజుల సమావేశాలు పి.బి. సిద్ధార్థ కళాశాల వెబినార్ హాలులో జరుగుతాయి.

ఈ 19న ఉదయం 10 గంటలకు అదానీ గ్రూప్, స్కిల్స్ & ఎడ్యుకేషన్ సీఈఓ రాబిన్ భౌమిక్ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఎకనామిక్స్ సంఘం అధ్యక్షుడు ప్రొ. మోహన్ పటేల్ అధ్యక్షత వహిస్తారు. కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ దేవరాజ్.ఆర్, సింబోజియా గ్రూప్ డైరెక్టర్ డా. జి.ఎస్. రాణా అతిథి ఉపన్యాసం ఇస్తారు. సిద్ధార్థ అకాడమి అధ్యక్షులు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి, నిమ్మగడ్డ లలితప్రసాద్, అకడమిక్ అడ్వైజర్ ప్రొ.ఎల్. కె.మోహనరావు మొదటి సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి శోభను చేకూరుస్తారు. ఈ సందర్భంగా పరశోధన వ్యాసాలతో కూడిన ప్రత్యేక సంచిక విడుదల చేస్తారు.

మొదటి రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 5వ రాష్ట్ర కమిషన్ సభ్యులు ప్రొ. ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక-ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అవకాశాలు, సవాళ్లపై ప్రసంగిస్తారు. 106 మంది ప్రముఖులు పరిశోధన పత్రాలు సమర్పిస్తారు. టిఎక్స్ (అమెరికా) ప్లానింగ్ హెడ్ హితేష్ మోహన్ అధ్యక్షతన ప్రత్యేక ఆన్‌లైన్ గోష్ఠి కూడా నిర్వహిస్తారు.  మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు స్టెల్లెన్‌బోష్ వర్సిటీ ప్రొఫెసర్ డా.ఆర్. కె. మిశ్రా దివంగత డా.ఐ.జి. పటేల్ స్మారక ఉపన్యాసం ఇస్తారు.