విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ ప్రత్యేక ఆహ్వానితుడు డాక్టర్ తరుణ్ కాకాని విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గురునానక్ కాలనీ రైతు బజార్లో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరలకు అందిస్తున్న ధరణి, కేఎన్ఎం బియ్యం విక్రయాల తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కిలో రూ.49, రూ.50 ధరలకు విక్రయిస్తున్న బియ్యం ధరలు, తూనికలు, విక్రయ విధానాలను తనిఖీ చేశారు. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన సన్న బియ్యం కిలో రూ.65 నుంచి రూ.75 వరకు పలుకుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ రాయితీ ధరలతో వినియోగదారులకు కిలోకు సుమారు రూ.15 నుంచి రూ.25 వరకు ఆదా అవుతోందని, 26 కిలోల బస్తాపై సుమారు రూ.400 నుంచి రూ.650 వరకు ధరల వ్యత్యాసం ఉంటుందని వివరించారు.
అనంతరం విజయవాడ నగరంలోని పలు ఆభరణాల దుకాణాల్లో కూడా డాక్టర్ తరుణ్ కాకాని తనిఖీలు నిర్వహించారు. బంగారు ఆభరణాల బరువు కొలతలు, బీఐఎస్ ధ్రువీకరణ, హాల్మార్కింగ్, జీఎస్టీ వివరాలు, నికర బరువు గణన తదితర అంశాలను పరిశీలించారు. వినియోగదారులకు విక్రయించే ఆభరణాల విషయంలో తూనికలు, నాణ్యత ప్రమాణాలు, సంబంధిత చట్టపరమైన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్ అధికారులు, ఎస్టేట్ అధికారి పాల్గొన్నారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలు, పరిశీలనల నివేదికలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరైన ధరలకు అందేలా చూడటంతో పాటు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
రైతు బజార్లో బియ్యం విక్రయాలు, నగరంలోని ఆభరణాల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
