ఎంబీబీయ‌స్‌లో 99.88 శాతం సీట్ల భ‌ర్తీ

-6,937లో 6,929 సీట్లు పొందిన విద్యార్థులు
-వీరిలో 61.34 శాతం అమ్మాయిలే
-నవంబరు 16తో ప్రవేశాల ప్రక్రియ పూర్తి
-మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు నివేదిక అంద‌జేసిన ఎన్టీఆర్ ఆరోగ్య‌ విశ్వ‌విద్యాల‌యం

అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 7,465 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, వీటిలో 528 సీట్లను అఖిల భారత కోటాకు కేటాయించారు. మిగిలిన 6,937 సీట్లు రాష్ట్ర ప‌రిధిలో ఉన్నాయి. వీటిలో 6,929 సీట్లు (99.88) భర్తీ అయ్యాయి. కేవలం 8 సీట్లు (0.12 శాతం) మాత్రమే ఖాళీగా మిగిలాయి. భర్తీ అయిన సీట్లలో 4,250 మంది విద్యార్థినులు (61.34 శాతం), 2,679 మంది విద్యార్థులు (38.66 శాతం) ఉన్నారు. ఈనెల 16తో ప్ర‌వేశాల ప్ర‌క్రియ ముగిసింది. ఈ ప్ర‌వేశాల భ‌ర్తీ నివేదిక‌ను ఎన్టీఆర్‌ ఆరోగ్య, విజ్ఞాన‌ విశ్వవిద్యాలయం రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు అంద‌జేసింది.

కన్వీనర్‌ కోటాలో అన్ని సీట్ల భర్తీ

రాష్ట్రంలో కన్వీనర్‌ కోటా కింద మొత్తం 4,581 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,631, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1,950 సీట్లు ఉన్నాయి. ఈ కోటాలోని అన్ని సీట్లూ భర్తీ అయ్యాయి. 1,723 మంది విద్యార్థులు (37.61 శాతం), 2,858 మంది విద్యార్థినులు (62.39 శాతం) ప్రవేశాలు పొందారు.

యాజమాన్య కోటాలో 2,348 సీట్ల భర్తీ

ఈ కోటాలో మొత్తం 2,356 సీట్లు ఉండగా, 2,348 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో 956 మంది విద్యార్థులు (40.72 శాతం), 1,392 మంది విద్యార్థినులు (59.28 శాతం) ప్రవేశాలు పొందారు. ఈ కోటాలోనూ విద్యార్థినులే అధికంగా ఉన్నారు. ప్రత్యేక చివరి విడత రెండో కౌన్సెలింగ్‌ అనంతరం ఎన్‌ఆర్‌ఐ కేటగిరీలో టిటిడి ఆధ్వ‌ర్యంలో న‌డిచే తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 7, ప్రైవేట్ వైద్య కళాశాలలో ఒక సీటు చొప్పున మిగిలాయి.

విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌న‌క‌ర నిర్ణ‌యం

పాడేరు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో 9, విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో 3 చొప్పున (రూ. 20 ల‌క్ష‌లు) సీట్లు మిగిలాయి. వీటిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేట‌గిరిలోకి మార్చి( ఫీజు రూ.12 ల‌క్ష‌లు) భ‌ర్తీ చేశారు. త‌ద్వారా అన్ని ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లో వంద శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయి.

ప్ర‌త్యేక కౌన్సెలింగ్ ద్వారా..

గ‌త వారం దేశ వ్యాప్తంగా 411 ఎంబిబియ‌స్ సీట్లు మిగిలిన‌ట్లు ఎన్ఎంసి ప్ర‌క‌టించింది. అప్ప‌టికి రాష్ట్రంలో ఎన్ఆర్ఐ (కేట‌గిరి-సి) కోటాలో మిగిలిన‌వి 69 సీట్లు. ఎన్ఎంసి ఇచ్చిన అనుమ‌తితో వీటి భ‌ర్తీ కోసం ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం రెండు సార్లు ప్ర‌త్యేకంగా(స్ట్రే రౌండ్‌) కౌన్సెలింగ్ నిర్వ‌హించింది. దీంతో 61 సీట్లు భ‌ర్తీ అయ్యాయి. చివరికి 8 సీట్లు మిగిలాయి.

పిడుగురాళ్ల వైద్య క‌ళాశాల‌లో…

తొలి సారిగా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్ర‌వేశాలు జ‌రిగాయి. ఇక్క‌డ‌ మొత్తం 50 సీట్లు ఉన్నాయి. వీటిలో 7 అఖిల భారత కోటా, 22 కన్వీనర్‌ కోటా, 21 యాజమాన్య కోటా సీట్ల‌కు ప్ర‌వేశాలు జ‌రిగాయి. కన్వీనర్‌ కోటాలోని మొత్తం 22 సీట్లూ మూడో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. సాధారణ కేటగిరీలో 61,593వ ర్యాంకు (524 మార్కులు) నుంచి 1,70,433వ ర్యాంకు (448 మార్కులు) వరకు సీట్లు కేటాయించారు. ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో విద్యార్థినుల వాటా 61.34 శాతంగా ఉండటం వైద్య విద్యలో మహిళల ప్రాధాన్యం పెరుగుతున్న తీరును స్పష్టం చేస్తోంది. కన్వీనర్‌, యాజమాన్య కోటాలు రెండింటిలోనూ విద్యార్థినులే అధిక శాతం సీట్లు సాధించడం విశేషం.