బాల్యం అమూల్యం.. బాలల హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత

-విద్య, నైపుణ్యాభివృద్ధితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఐఏఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బాల్యం ఎంతో అమూల్యమైనదని, బాలల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ ప్రభుత్వంతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ ఐఏఎస్ అన్నారు. విద్య, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా బాలలు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
గురువారం విజయవాడలోని కబేళా ప్రభుత్వ బాలుర వసతి గృహంలో జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్ వి. వసంత బాల తదితర ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ బాలలు కోపం, చెడు స్నేహాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే మంచి విషయాలను నేర్చుకుంటూ, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో వారోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో రూపొందించిన వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ వి. వసంత బాల మాట్లాడుతూ బాలల హక్కుల వారోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. విద్య, క్రమశిక్షణతోనే బాలలు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోగలరని పేర్కొన్నారు.
ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం అన్ని ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేయడం సంతోషకరమన్నారు. ఆపదలో ఉన్న బాలలను రక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని, ఎక్కడైనా బాలలు ఆపదలో ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు.
ప్రభుత్వ బాలుర వసతి గృహం సూపరింటెండెంట్ శరత్ మాట్లాడుతూ బాలలందరూ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎదిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కె. సీతాకుమారి, అమృత హస్తం ఫౌండేషన్ ప్రెసిడెంట్ ధారా కరుణశ్రీ, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కోటి ప్రకాష్ కుమార్, రీజినల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ప్రొఫెషన్ సత్యవతి, జోనల్ జస్టిస్ బోర్డు సభ్యురాలు పుష్పలత, ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాజేశ్వరరావు, ప్రొటెక్షన్ ఆఫీసర్లు వై. జాన్సన్, దుర్గాప్రసాద్, లీగల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.