-ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త విచారణ జరిపించాలి – ఏఐటీయూసీ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు, 129 డిపోలు, నాలుగు జోనల్ వర్క్‌షాప్‌లు, ప్రధాన బస్టాండ్లు, ఆసుపత్రులు, స్టోర్స్, టైర్ షాపులు తదితర విభాగాల్లో 8,500 మందికి పైగా ఔట్సోర్సింగ్ కార్మికులు అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్మికులు ఎదుర్కొంటున్న వేతనాలు, PF, ESI, ఉద్యోగ భద్రత, గుత్తేదారుల దోపిడీ తదితర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య, ఏపీఎస్ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. గంగాంజనేయులు రాష్ట్ర కమిటీ ప్రతినిధులతో కలిసి ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ ని కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఔట్సోర్సింగ్ కార్మికులపై గుత్తేదారుల ద్వారా జరుగుతున్న దోపిడీని ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా పరిగణించాలని కోరారు. కార్మికుల వేతనాల నుంచి PF, ESI పేరుతో కోతలు విధిస్తూ, ఆ మొత్తాలను సంబంధిత ఖాతాల్లో సక్రమంగా జమ చేయకపోవడం తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. కార్మికులు ప్రతినెలా వేతనాలు సకాలంలో అందకపోవడం, వేతనాల్లో వ్యత్యాసాలు, PF–ESI చెల్లింపుల్లో అక్రమాలు, కార్మికుల ATM కార్డులు, బ్యాంకు పాస్‌పుస్తకాలను గుత్తేదారులు తమ ఆధీనంలో ఉంచుకోవడం వంటి సమస్యలతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కార్మికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ఆర్టీసీ యాజమాన్యానికి ఉందని, థర్డ్ పార్టీ గుత్తేదారుల దోపిడీకి ముగింపు పలికి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఏఐటీయూసీ అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, థర్డ్ పార్టీ కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి, కార్మికులను APCOS పరిధిలోకి తీసుకురావాలని, ఆర్టీసీ యాజమాన్యం ద్వారానే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ చేయాలని, ప్రతి నెలా 10వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, విద్యుత్ బస్సుల కారణంగా విధుల నుంచి తొలగించబడిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మహిళా కార్మికులకు చట్టబద్ధమైన ప్రసూతి సెలవులు, ఓవర్‌టైమ్ వేతనాలు, వారాంతపు సెలవులు, జాతీయ, రాష్ట్ర పండుగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. గంగాంజనేయులు మాట్లాడుతూ, కార్మికులందరికీ ఆర్టీసీ వైద్య సదుపాయాలు, జీవిత బీమా, ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్లను స్కిల్డ్ కేటగిరీగా గుర్తించి తగిన వేతనాలు చెల్లించాలని తెలిపారు. ఒక రోజు సెలవుకు రెండు రోజుల వేతనం కోత విధించే అన్యాయపు విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, వర్క్‌షాప్‌లు, బస్టాండ్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై ప్రత్యేక విచారణ నిర్వహించి, గుత్తేదారుల అక్రమాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ ని కోరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు: రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బాజి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతిన మధుసూదన్ రావు, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ హనీఫ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి అనకాపల్లి అశోక్, రాష్ట్ర ట్రెజరర్ ప్రసాద్ కుమార్, రాష్ట్ర నాయకులు అశోక్,అప్పలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
