–పి.బి. సిద్ధార్థలో అంతర్జాతీయ సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దేశ యువతలో ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు కొరవడ్డాయని, చాలా కాలంగా సేవారంగానికి పెద్దపీట వేస్తూ పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేశామని ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సీఈఓ ప్రొ.డి.సూర్యచంద్రరావు అన్నారు. శుక్రవారం పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వెబినార్ హాలులో ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అల్లైడ్ సైన్సెస్ అసోసియేషన్ వికసిత్ భారత్ 7వ అంతర్జాతీయ సదస్సు రెండోరోజు చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడుతూ దేశజనాభాలో 40 శాతం మందికి వ్యవసాయమే ఆధారమైనప్పటికీ జీడీపీలో దాని వాటా పరిమితంగా ఉందన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. ఎ. రాజశేఖర్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ చైనా ఎగుమతులు తగ్గుతున్నాయని, టారిఫ్ కారణంగా చైనా నుంచి బహుళజాతి సంస్థలు భారత్ వైపు వేస్తున్న అడుగులు వికసిత్ భారత్ లక్ష్యాన్ని సుగమం చేస్తున్నాయన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొ. ఆర్. శివరామప్రసాద్ మాట్లాడుతూ వికసిత్ భారత్ అవరోధాల్లో అవినీతి ఒకటన్నారు. ధనిక, పేద ఆర్థిక వ్యత్యాసాలు తగ్గకపోగా పెరుగుతున్నాయన్నారు. విట్ ఏపీ వర్సిటీవ్ డీన్ ప్రొ. అరుణ్‌కుమార్ శివకుమార్, ప్రభుత్వ మహిళా కళాశాల( అల్వార్, రాజస్థాన్) ఆచార్యులు సత్య భాన్ యాదవ్ వికసిత్ తదితరులు వికసిత్ భారత్ సవాళ్లను స్పృశిస్తూ మాట్లాడారు. ఆటోమేషన్ వల్ల ప్రజలు ఉపాధి కోల్పోతుండగా, మరో పక్క వ్యవసాయరంగంలో కూడా ఉపాధి తగ్గుతోందన్నారు. గత 15 ఏళ్లుగా భారతదేశంలో అన్ని రంగాల పురోగతి వేగం అందుకుందని, అంతకుముందు యాభై సంవత్సరాల పాటు వృద్ధిరేటు మందకొడిగా సాగిందన్నారు.అనంతరం కళాశాలలో ఐదు చోట్ల సమాంతరంగా జరిగిన సదస్సుల్లో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రముఖులు పరిశోధన పత్రాలు సమర్పించారు. వీరిని ప్రిన్సిపాల్ డా. మేకా రమేశ్ , డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేశ్ సి.జంపాల, ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అల్లైడ్ సైన్సెస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రొ.మోహన్ పటేల్,డా.అలోక్ కుమార్ సత్కరించారు. వివిధ రాష్ట్రాల అతిథి వక్తలు అలరించేందుకు సిద్ధార్థ కళావేదికపై విద్యార్థులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు కనుల పండువుగా సాగాయి.
