బాలల హక్కులను పరిరక్షిస్తూ బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మిద్దాం

-బాలల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది – ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బి.ఎస్. కోటేశ్వరరావు
-విజయవాడలో ఘనంగా ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం
-బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
బాలల హక్కులను పరిరక్షిస్తూ బాలల స్నేహపూర్వక సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బి.ఎస్. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏ దేశంలోనైతే బాలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారో ఆ దేశం సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించిన బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం విజయవాడ సివిల్ కోర్టుల ఎదురుగా ఉన్న సీవీఆర్ నగరపాలక సంస్థ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, జువెనైల్ వెల్ఫేర్ శాఖతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బి.ఎస్. కోటేశ్వరరావు మాట్లాడుతూ, బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటూ ప్రతి సంవత్సరం బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. బాలల హక్కులు, వారి సమస్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన, చైతన్యం కలిగి ఉండాలని సూచించారు. విద్య ద్వారానే బాలలు ఉన్నత స్థాయికి చేరుకోగలరని, పేదరికం వారి అభివృద్ధికి ఆటంకం కాకూడదని అన్నారు.

బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, బాలలపై లైంగిక వేధింపుల నివారణ వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి పాఠశాలలో, బాలలు సంచరించే ప్రదేశాల్లో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉండాలని సూచించారు. బాలలు తమకు ఎదురయ్యే సమస్యలను ఫిర్యాదుల పెట్టెల ద్వారా తెలియజేస్తే సంబంధిత అధికారులు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని వివరించారు.

ఆత్మీయ అతిథిగా పాల్గొన్న విజయవాడ ప్రముఖ న్యాయవాది డాక్టర్ ఎం.ఎల్.ఎస్. ప్రసాద్ బాబు మాట్లాడుతూ, నేటి బాలలు, యువత సమాజంలో మార్పు తీసుకురాగల శక్తివంతమైన ప్రతినిధులని అన్నారు. మెరుగైన ప్రపంచ నిర్మాణానికి అవసరమైన నూతన ఆలోచనలు, దృక్పథాలు వారిలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ రూపొందించిన ప్రపంచ బాలల హక్కుల వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ, బాల్యం ఎంతో అమూల్యమైనదని, ప్రతి చిన్నారి ఆనందంగా పెరిగి, తన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాలల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి నవంబర్ 20న ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

ఆత్మీయ అతిథిగా పాల్గొన్న బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కోటే ప్రకాష్ కుమార్, అరవ రమేష్ ఆలపించిన చైతన్య గీతాలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ ఆఫీసర్ దుర్గాప్రసాద్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కోటే ప్రకాష్ కుమార్, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కోఆర్డినేటర్ వై. విజయకృష్ణ, సమగ్ర శిక్ష ఎన్టీఆర్ జిల్లా కెరీర్ గైడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ డాక్టర్ రమేష్, జొన్నలగడ్డ ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.వి. సుబ్రహ్మణ్యం, లతా వసంతకుమారి, ఎస్. సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, సంయుక్త ఫౌండేషన్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థి ప్రతినిధులతో పాటు సుమారు 250 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.