పాఠశాల విద్యలో ఆరోగ్యకర ఆహారానికి ప్రాధాన్యత

-విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంపొందించాలి – సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు
-‘నీట్-ఎస్’ ఆంధ్రప్రదేశ్ నివేదిక విడుదల
-‘Healthy Diets for Healthy Futures’ సోషల్ మీడియా ప్రచారం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహనను పాఠశాల విద్యలో అంతర్భాగంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఐఏఎస్ తెలిపారు. ఉపాధ్యాయుల పాత్రను బలోపేతం చేస్తూ విద్యార్థులు తమ ఎదుగుదలకు మేలు చేసే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.

శుక్రవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘నీట్-ఎస్’ (NEAT-S) ఆంధ్రప్రదేశ్ నివేదికను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలోని 556 పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, శారీరక కార్యకలాపాలు, కౌమార వయసు విద్యార్థుల ఆహారపు అలవాట్లపై నిర్వహించిన అధ్యయన వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు.

ఈ సందర్భంగా యునిసెఫ్ హైదరాబాద్ క్షేత్ర కార్యాలయ అధిపతి డాక్టర్ జెలాలెమ్ తఫస్సే మాట్లాడుతూ, పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించడానికి కేవలం అవగాహన కల్పించడం సరిపోదని, పోషకాహారం సులభంగా అందుబాటులో ఉండే వాతావరణాన్ని కూడా పాఠశాలల్లో కల్పించాలని అన్నారు. ఇందుకోసం పాఠశాలలు, తల్లిదండ్రులు, స్థానిక సమాజాలు, ఆరోగ్య విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి చిన్నారికి సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు అవసరమైన వ్యవస్థలను బలోపేతం చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యునిసెఫ్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

నివేదికలోని అధ్యయన ఫలితాల ప్రకారం, పాల్గొన్న కౌమార వయసు విద్యార్థుల్లో 85 శాతం మంది రాగి జావను, 92 శాతం మంది మిల్లెట్ చిక్కీని ఇష్టపడుతున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో 85 శాతానికి పైగా విద్యార్థులు పాఠశాలల్లో ఉన్న సమయంలో అతిగా ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తీసుకుంటున్నట్లు అధ్యయనంలో గుర్తించారు.

‘Healthy Diets for Healthy Futures’ ప్రచారం ప్రారంభం
పిల్లలు, యువతలో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన పెంపొందించి, రోజువారీ జీవితంలో మెరుగైన ఆహార ఎంపికలు చేసుకునేలా పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సంయుక్తంగా ‘Healthy Diets for Healthy Futures’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించాయి.

NEAT-S అధ్యయన ఫలితాల ఆధారంగా రూపొందించిన ఆరు భాగాల ప్రచారంలో సమతుల ఆహారం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, ఫుడ్ లేబుళ్లను చదవడం, ఆరోగ్యకరమైన చిరుతిళ్ల ఎంపిక, శారీరక చురుకుదనం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు.

సమగ్ర శిక్ష, మధ్యాహ్న భోజన పథకం విభాగం, SCERT, పాఠశాలలు, ఉపాధ్యాయులు, యునిసెఫ్ సమన్వయంతో విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలపై అవగాహన, నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు పాఠశాలల్లో అందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించనున్నారు. డిజిటల్ వేదికలు, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, నో బ్యాగ్ డే, గ్రాండ్ అసెంబ్లీల ద్వారా ఈ సందేశాలను విద్యార్థులకు చేరవేయనున్నారు.

విద్యార్థులు నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టేలా ‘మై హెల్తీ ప్లేట్’ (My Healthy Plate), ‘హెల్దీ స్నాక్ ఛాలెంజ్’ (Healthy Snack Challenge), ‘రీడ్ బిఫోర్ యు ఈట్’ (Read Before You Eat) వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు. పాఠశాలల్లో పోషకాహార బోధనను మరింత బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయుల కోసం ‘దీక్ష’ (DIKSHA) వేదికపై ప్రత్యేక శిక్షణ కోర్సును కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది.

ఈ కార్యక్రమంలో సీమ్యాట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఆర్. ప్రసన్న కుమార్, మధ్యాహ్న భోజన పథకం జాయింట్ డైరెక్టర్ ఆర్.ఎస్. గంగా భవాని, స్టేట్ జీసీడీవో వి.ఎస్.ఎన్. మూర్తి, యునిసెఫ్ ఇండియా కంట్రీ ఆఫీస్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ప్రీతు మిశ్రా, ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ శేషగిరి మధుసూదన్, న్యూట్రిషన్ స్పెషలిస్టులు ఖ్యాతి తివారీ, గౌరి తదితరులు పాల్గొన్నారు.