-రాజమహేంద్రవరంలో 269 కేసుల విచారణ.. 145 కేసుల్లో తుది ఉత్తర్వులు
-కర్నూలులో 206 కేసుల విచారణ.. 104 కేసుల్లో తుది ఉత్తర్వులు
-రెండు కేంద్రాల్లో కలిపి 475 కేసుల విచారణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ప్రక్రియ) నిబంధనావళి–2013లోని 5వ నిబంధన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్యాంపు కోర్టులలో భాగంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన మానవ హక్కుల కమిషన్ క్యాంపు కోర్టు కార్యకలాపాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గౌరవ చైర్పర్సన్ జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ క్యాంపు కోర్టు నిర్వహించారు. రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పోలవరం జిల్లాలకు సంబంధించిన పాత కేసుల విచారణతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నూతన ఫిర్యాదుల స్వీకరణ కూడా చేపట్టారు.
రాజమహేంద్రవరం క్యాంపు కోర్టులో 269 కేసుల విచారణ
రాజమహేంద్రవరం కేంద్రంగా నిర్వహించిన క్యాంపు కోర్టులో మొత్తం 269 కేసులను విచారణకు జాబితా చేయగా, వాటిలో 145 కేసులపై అక్కడికక్కడే తుది ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 123 కేసులను తదుపరి విచారణ నిమిత్తం వాయిదా వేస్తూ, సంబంధిత ఫిర్యాదుదారులు, ప్రతివాదులకు తదుపరి విచారణ తేదీలను తెలియజేయాలని ఆదేశించారు. ఈ క్యాంపు కోర్టు నిర్వహణ సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 11 నూతన ఫిర్యాదులు అందగా, వాటిపై కూడా విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఒక ఫిర్యాదుదారు తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు.
నూతన ఫిర్యాదుల దాఖలుకు ప్రజల ఆసక్తి
మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులు దాఖలు చేసేందుకు నాలుగు రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 50 మంది వరకు అర్జీదారులు రాజమహేంద్రవరం క్యాంపు కోర్టుకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ప్రక్రియ) నిబంధనావళి–2013 ప్రకారం ఫిర్యాదులు దాఖలు చేయాల్సిన విధివిధానాలు, నిబంధనలను వారికి వివరించారు. అవసరమైన పత్రాలు, విధివిధానాలను పూర్తిచేసుకుని తదుపరి క్యాంపు కోర్టు నిర్వహణ సమయంలో మరిన్ని ఫిర్యాదులు దాఖలు చేసే అవకాశం ఉందని తెలిపారు.
కర్నూలులోనూ ఏకకాలంలో హెచ్ఆర్సీ బెంచ్ నిర్వహణ
రాజమహేంద్రవరంలో క్యాంపు కోర్టు నిర్వహించిన సమయంలోనే కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయంలో కూడా ఏకకాలంలో బెంచ్ కార్యకలాపాలు నిర్వహించారు. కమిషన్ గౌరవ సభ్యులు ఎన్. శ్రీనివాసరావు, జె.వి. మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులో ఐదు రోజుల పాటు నిర్వహించిన విచారణల్లో మొత్తం 206 కేసులను జాబితా చేశారు. వీటిలో 104 కేసులపై తుది ఉత్తర్వులు జారీ చేయగా, మిగిలిన 102 కేసులను తదుపరి విచారణకు వాయిదా వేశారు.
రెండు కేంద్రాల్లో కలిపి 475 కేసుల విచారణ
రాజమహేంద్రవరం, కర్నూలు కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన హెచ్ఆర్సీ బెంచ్ కార్యకలాపాల్లో మొత్తం 475 కేసులను విచారణకు స్వీకరించారు. వీటిలో 249 కేసులపై తుది ఉత్తర్వులు జారీ చేయగా, మిగిలిన 225 కేసులను తదుపరి విచారణకు వాయిదా వేశారు. రెండు కేంద్రాల్లోనూ ఫిర్యాదుదారులు వ్యక్తిగతంగా హాజరై తమ ఫిర్యాదులను సమర్పించడంతో పాటు, గతంలో దాఖలైన కేసుల విచారణ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో మానవ హక్కుల కమిషన్ విచారణ కార్యకలాపాలు సమాంతరంగా సజావుగా కొనసాగాయి.
చివరి రోజున కూడా నూతన ఫిర్యాదుల స్వీకరణ
ఈ నెల 20వ తేదీన గౌరవ చైర్పర్సన్ జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి సెలవులో ఉన్నప్పటికీ, కమిషన్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్యాంపు కోర్టు కార్యకలాపాల్లో భాగంగా నూతన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. క్యాంపు కోర్టు నిర్వహణకు సంబంధించిన వివరాలను కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయ నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ వెల్లడించారు.
