రాజమహేంద్రవరం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి విజయంపై నేతల ధీమా

-కూటమి ముఖ్య నేతల కీలక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని కూటమి ముఖ్య నేతలు నిర్ణయించారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారి కార్యాలయంలో నిర్వహించిన కూటమి ముఖ్య నేతల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జి అరవింద్ భగారియా, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి, మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి తదితర కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల ప్రచార వ్యూహం, అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పాలన కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమని నేతలు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ లక్ష్యమైన అభివృద్ధి, సంక్షేమ పాలనను నగరంలోని ప్రతి ఇంటికీ చేరవేయడంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఐక్యత, నాయకుల సమన్వయం, కార్యకర్తల అంకితభావంతో ఎన్నికల బరిలో సమష్టిగా పనిచేస్తే రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేశారు.