మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలు

-రెండు రోజుల్లో సర్పంచ్ పదవులకు 16,505, వార్డు సభ్యుల పదవులకు 60,420 నామినేషన్లు
-రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన నామినేషన్ల స్వీకరణలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిన నివేదికల ప్రకారం, మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న 25 జిల్లాల్లోని 214 మండలాల పరిధిలో 4,244 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా, రెండు రోజుల్లో సర్పంచ్ పదవులకు మొత్తం 16,505 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 60,420 నామినేషన్లు దాఖలయ్యాయి.

రోజువారీ నామినేషన్ల వివరాలు:

సర్పంచ్ పదవులకు:

– మొదటి రోజు (21.11.2026): 4,929
– రెండో రోజు (22.11.2026): 11,576
– మొత్తం: 16,505

వార్డు సభ్యుల పదవులకు:

– మొదటి రోజు (21.11.2026): 13,611
– రెండో రోజు (22.11.2026): 46,809
– మొత్తం: 60,420

రెండో రోజు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొదటి రోజుతో పోలిస్తే అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.

మూడో విడత ఎన్నికల పరిధిలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నామినేషన్లు దాఖలయ్యాయి.

పోలవరం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, తిరుపతి జిల్లాల్లో మూడో విడతలో ఎన్నికలు నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీలు లేవు.

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, తదితర ఎన్నికల ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది.