-రాజమండ్రిలో కూటమి విజయభేరి.. ప్రజల మద్దతు కూటమికే
-శ్యామల సెంటర్ నుంచి కోటగుమ్మం వరకు హోరెత్తిన కూటమి ర్యాలీ
-ప్రతి డివిజన్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజమండ్రిలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. శ్యామల సెంటర్ నుంచి కోటగుమ్మం వరకు సాగిన ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ఐక్యతను చాటారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమహేంద్రవరం మేయర్ అభ్యర్థి రేలంగి శ్రీదేవి తదితర కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, సంతృప్తికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. గత ప్రభుత్వ విధ్వంసక పాలనకు భిన్నంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. పేదల సంక్షేమం నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు, యువతకు ఉపాధి అవకాశాల నుంచి రైతుల సంక్షేమం వరకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో భరోసా నింపుతున్నాయన్నారు. ఈ ప్రజాభిమానమే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు లభించిన ఘన విజయాలకు పునాదిగా నిలిచిందని వివరించారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయం తథ్యం. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న ఐక్యత, ప్రజల ఆశీస్సులు కూటమికి కొండంత బలమని ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రి నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలు కల్పించేందుకు కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత విభేదాలకు, చిన్నచిన్న మనస్పర్థలకు తావివ్వకుండా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని కోరారు.
