విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విశ్వశాంతి, సర్వమానవ సౌభాగ్యం, సమాజ సేవే లక్ష్యంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలను సోమవారం సాయంత్రం సీతారాంపురం, ఏలూరు రోడ్డులోని శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ హాజరై స్వామివారికి నివాళులర్పించారు. అనంతరం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో పేదలకు, మున్సిపల్ సిబ్బందికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ, సత్యసాయి బాబా అందించిన విద్య, వైద్యం, తాగునీరు వంటి సేవలు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఆయన బోధించిన “మానవ సేవే మాధవ సేవ” అనే సందేశం స్ఫూర్తితో భక్తులు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గత ఏడాది బుడమేరు వరదల సమయంలో పుట్టపర్తి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సత్యసాయి భక్తులు విజయవాడ వరద బాధితులకు సుమారు రూ.కోటి విలువైన నిత్యావసర సరుకులు, వస్త్రాలు అందించడం అభినందనీయమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, పేదలకు సేవ చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఘనంగా శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు
