-వేడుకల్లో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్
కరీంనగర్, నేటి పత్రిక ప్రజావార్త:
కరీంనగర్ జిల్లాలో యాదవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సదర్ సమ్మేళన వేడుకల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సభ్యులు సందబోయిన మహేంద్రనాథ్ యాదవ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ సోదరులు, సంఘం నాయకులు, ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గం విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నత చదువులు అభ్యసించాలని సూచించారు. విద్య ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
యాదవుల ఐక్యత, విద్యాభివృద్ధి, రాజకీయ చైతన్యం సమాజ ప్రగతికి దోహదపడతాయని తెలిపారు. అన్ని రంగాల్లో యాదవులు రాణిస్తూ సమాజంలో మరింత గౌరవం, గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు.
ఈ సదర్ సమ్మేళనంలో యాదవ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత, యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.
