-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుచున్న బాలల సంరక్షణ కేంద్రాలకు ప్రభుత్వ అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసలి అప్పారావు ఒక ప్రకటనలో తెలిపారు. బాలల న్యాయచట్టప్రకారం 18 సం లోపు గల రక్షణ సంరక్షణ అవసరమగు నిరాదరణకు గురైన బాలలను వసతి గృహాలలో చేర్పించే ముందు తప్పని సరిగా ఆయా జిల్లాలకు సంబంధించిన బాలల సంక్షేమ సమితి వారు ఆదేశాలతో బాటు జిల్లా అధికారులచే ధృవీకరించిన లైసెన్సు విధిగా ఉండాలన్నారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. కమిషన్ కార్యాలయంలో జువైనెల్ వెల్ఫేర్ డైరెక్టర్ బి.డి.వి.ప్రసాద్ మూర్తి మాట్లాడుతూ ఏ సంస్థ అయినా ఇటువంటి పిల్లలతో బాలల సంరక్షణ కేంద్రం నిర్వహించాలనుకుంటే బాలల న్యాయచట్టం, సెక్షన్ 41 నియమ, నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకొని లైసెన్సును జిల్లా అధికారులు ధృవీకరణతో తీసుకోవాలని తెలిపారు. బాలల సంరక్షణ కేంద్రాన్ని తరచుగా జిల్లాస్థాయి అధికారులు బాలల హక్కులు ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షిస్తారని, మౌళిక సదుపాయాలు, బాలల రక్షణచర్యలు, బాలల సంరక్షణ కేంద్రం తీసుకుంటున్న విధి విధానాలపై నిఘా పెట్టి, నియంత్రణను జిల్లా యంత్రాంగం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జె.రాజేంద్ర ప్రసాద్, జి. సీతారాం, టి. ఆదిలక్ష్మి, బి. పద్మావతి, ఎం. లక్ష్మీదేవి మరియు కమిషన్ కార్యదర్శి టి.వి. శ్రీనివాస్ ప్రోగ్రాం ఆఫీసర్ పద్మజ, మునిరాజు, లక్ష్మీ, అరుణ పాల్గొన్నారు.