Breaking News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు స్పందించాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 8వ తేదీన విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ గురించి కనీసం ప్రస్తావించకపోవడం విచారకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఆక్షేపించారు.
ఈ మేరకు కె. రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటన సందర్భంగా భారీ బహిరంగసభ నిర్వహించి, రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు చెబుతున్నారు. కాని ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి ప్రధాని మోడీగానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగానీ, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌గానీ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం విచారకరం.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే దురుద్దేశ్యంతోనే గత 4 మాసాలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలేదు. పైగా స్టీల్‌ ప్లాంట్‌లో దశలవారీగా ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు క్యాపిటివ్‌ మైన్స్‌ కేటాయించకుండా, మిట్టల్‌ ఏర్పాటుచేసే ప్రైవేటు పరిశ్రమకు క్యాపిటివ్‌ మైన్స్‌ కావాలని కోరడం దుర్మార్గం. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ‘‘మాకు అధికారం ఇస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపుతామని’’ చెప్పారు. ‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే’ నంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు లేఖ కూడా వ్రాశారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలయినప్పటికీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఒక్కమాట కూడా మాట్లాడడంలేదు. పైగా మభ్యపెట్టడానికి మిట్టల్‌ ప్రైవేటు స్టీల్‌ ఫ్యాక్టరీని ముందుకు తెస్తున్నారు. ఇది దుర్మార్గం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌లు విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ అంశాన్ని గాలికివదిలేస్తే చరిత్రలో అనామకులుగా మిగిలిపోతారు. ఇప్పటికైనా స్పందించి విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను ఆపేందుకు నోరు విప్పాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *