-విద్యుదాఘాతంతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు మల్లాది విష్ణు చొరవతో పరిహారం
-ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేతుల మీదుగా ఎక్స్ గ్రేషియా పత్రాలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ప్రజలు సుధీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా తక్షణ పరిష్కారం లభిస్తోంది. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చొరవతో పరిహారం మంజూరైంది. సుందర్ కాలనీకి చెందిన పఠాన్ అయూబ్ ఖాన్, ముత్యాలంపాడుకు చెందిన మద్దాలి సాయి లోకేష్.. విధులు నిర్వహిస్తున్న సమయంలో వేర్వేరు ప్రాంతాలలో ఎలక్ట్రిక్ షాక్ కు గురై ప్రాణాలు విడిచారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 27, 28 డివిజన్ల పరిధిలో పర్యటించిన మల్లాది విష్ణుని మృతుల కుటుంబసభ్యులు కలిసి తమ బాధను విన్నవించారు. ఏడాది గడిచినా తమకు పరిహారం అందలేదని గోడును వెలిబుచ్చారు. స్పందించిన ఆయన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఆఫ్ ఏపీసీపీడీసీఎల్ తో మాట్లాడి ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం మంజూరు చేయించారు. బుధవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మల్లాది విష్ణు చేతులమీదుగా మృతుల కుటుంబసభ్యులకు పరిహారం పత్రాలను అందజేశారు. తమ సమస్యను దృష్టికి తీసుకువచ్చిన వెనువెంటనే పరిష్కారం చూపడంపై మృతుల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చేసిన మేలుకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఆఫ్ ఏపీసీపీడీసీఎల్ కు మల్లాది విష్ణు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు కొండాయిగుంట మల్లేశ్వరి బలరాం, కొంగితల లక్ష్మీపతి, ఎలక్ట్రికల్ ఈఈ సుధాకర్, డిఈ నాగసాయి, ఏఈలు పాల్గొన్నారు.