-వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టమైన ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) నిర్దేశించిన ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. కళాశాలల్లో బోధనా సిబ్బంది అందుబాటు నుంచి ఆసుపత్రుల్లో రోగులకు అందించే వైద్య సేవలు, పడకల వినియోగం, మౌలిక సదుపాయాలు, వైద్య రికార్డుల నిర్వహణ వరకు ప్రతి అంశం ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తమ పనితీరుకు పూర్తి బాధ్యత వహించాలని సూచించారు. ఈ మేరకు విజయవాడలోని వైద్య విద్యా డైరెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల వర్క్‌షాప్‌లో తొలిరోజు 7 జిల్లాల వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల పనితీరును సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు తమ సంస్థల్లోని పరిస్థితులు, సమస్యలు, చేపట్టిన అభివృద్ధి చర్యలను ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు.
ర్యాగింగ్ విషయంలో ఉపేక్షించేది లేదు
ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే మందులకు సంబంధించి ప్రతిరోజూ సమీక్షించాలన్నారు, సిడియస్ లో లేని మందులను ఆసుపత్రుల సూపరింటెండెంట్లు స్థానికంగా కొనుగోలు(లోకల్ పర్చేజ్) చేసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ జరగకకుండా చర్యలు తీసుకోవాలని, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్లతో నిరంతరం పర్యవేక్షిస్తూ ర్యాగింగ్‌ను అరికట్టాలని సూచించారు. ర్యాగింగ్ విషయంలో ఏమాత్రం ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు.
ప్రతి రోగి వైద్య వివరాలు డిజిటల్ రికార్డుల్లో ఉండాలి
ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే ప్రతి రోగికి ఆభా (ABHA) గుర్తింపు సంఖ్య సృష్టించి వైద్య రికార్డులతో అనుసంధానించాలని ఆదేశించారు. ఇన్‌పేషెంట్ విభాగాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు రోగుల వ్యాధి నిర్ధారణ వివరాలు, ఆభా గుర్తింపు సంఖ్యలతో ప్రధాన రిజిస్టర్ నిర్వహించాలి. సంబంధిత వైద్య బోధకులతో ఆ వివరాలను ధ్రువీకరించాలి. ఓపీ సేవలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్‌ఐ, ప్రయోగశాల పరీక్షల సంఖ్య ఎన్‌ఎంసీ నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గకుండా ఉండేలా చూడాలని సూచించారు.
వైద్య సేవల నుంచి సిబ్బంది హాజరు వరకు నిరంతర నిఘా
ప్రమాద బాధితుల వివరాల నమోదు వ్యవస్థ (ట్రామా రిజిస్ట్రీ)ని పకడ్బందీగా అమలు చేయాలి. ఓపీ, ఐపీ సేవలు, ముఖ గుర్తింపు హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్), శస్త్రచికిత్సలు, ఎన్‌ఎంసీ ఏఈబీఏఎస్ హాజరును నిరంతరం పర్యవేక్షించాలని సూపరింటెండెంట్లకు సూచించారు. వైద్య పరికరాల మరమ్మతులు, వెంటిలేటర్లు, పని కేంద్రాలు, అత్యవసర చికిత్స విభాగాలకు అవసరమైన ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా సమర్పించాలన్నారు. వైద్య విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లు, శుద్ధి చేసిన తాగునీటి సదుపాయాలు కల్పించాలి. ర్యాగింగ్ నిరోధక కమిటీలను బలోపేతం చేయాలి. ప్రమాద చికిత్స విభాగాలు, ప్రసవ గదులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. విద్యార్థుల్లో పరిశోధనలను ప్రోత్సహించాలి. ఆసుపత్రుల పరిసరాల్లో పారిశుద్ధ్యం, భద్రత, పురుగుల నివారణ చర్యలపై కఠిన పర్యవేక్షణ ఉండాలి. ప్రమాద చికిత్స విభాగాల్లో చక్రాల కుర్చీలు, స్ట్రెచర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల నిర్వహణలో అవినీతికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని డీఎంఈ స్పష్టం చేశారు. ముందస్తు క్యాన్సర్ గుర్తింపు విభాగాల నుంచి మెరుగైన వైద్యం కోసం పంపించే రోగులకు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించాలని సూచించారు.
కార్యాలయ నిర్వహణ, ఆర్థిక నిబంధనలు, నియామకాలు, రిజర్వేషన్లు, సెలవుల నిబంధనలు, మౌలిక సదుపాయాల నిర్వహణపై జాయింట్ డైరెక్టర్లు కర్రి అప్పారావు, గణపతిరావు వివరించారు. వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని ఏపీఎంఎస్‌ఐడీసీ ముఖ్య ఇంజినీర్ బలరామిరెడ్డి సమీక్షించారు. అడిషనల్ డైరెక్టర్(మెడికల్ ఎడ్యుకేషన్ )డాక్టర్ రాధికారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బుధవారం జరిగే రెండో రోజు వర్క్‌షాప్‌లో మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, కడప జిల్లాలకు చెందిన వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, బోధనా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొంటారు.
