-జనవరి 1 నుంచి ప్రజలకు సంజీవని వైద్య సేవలు అందించేందుకు సన్నాహాలు
-శిక్షణలో ప్రతి అంశాన్ని సమగ్రంగా నేర్చుకుని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ ఉచితంగా నిపుణుల వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జనవరి 1, 2027 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న సంజీవని కార్యక్రమం నాలుగో విడత శిక్షణను జిల్లా కలెక్టర్ బుధవారం సందర్శించారు. శిక్షణలో పాల్గొంటున్న వైద్యాధికారులు, సామాజిక ఆరోగ్య అధికారులతో మాట్లాడి శిక్షణ కార్యక్రమం పురోగతిని, అందిస్తున్న అంశాలను సమీక్షించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందే అవసరమైన శిక్షణ, సన్నద్ధత, సమన్వయ చర్యలను పూర్తి చేసుకుని ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సంజీవని కార్యక్రమం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించనుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. శిక్షణ పొందుతున్న వైద్యాధికారులు, సామాజిక ఆరోగ్య అధికారులు ప్రతి అంశాన్ని శ్రద్ధగా, సమగ్రంగా నేర్చుకోవాలని సూచించారు. శిక్షణలో పొందిన క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా వినియోగిస్తూ, కార్యక్రమ అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో, నాణ్యతతో అందేలా వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ.శ్రవణ్ బాబు మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేబీఎన్ కళాశాల పరిపాలనా అధికారి నారాయణ, జిల్లా కార్యక్రమ నిర్వహణ అధికారి డాక్టర్ నవీన్, జిల్లా కార్యక్రమ అధికారి మహేష్, డాక్టర్ శ్రావణి, డాక్టర్ కార్తీక్, టాటా సంస్థ తరఫున సత్యనారాయణ, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
