పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌ర్వ స‌న్న‌ద్ధం..

– ఈ నెల 26న తొలిద‌శ‌లో 73 గ్రామ పంచాయ‌తీలు, 856 వార్డుల్లో ఎన్నిక‌లు
– నిష్ప‌క్ష‌పాతంగా , శాంతియుతంగా నిర్వ‌హ‌ణ‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
– ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు 9,000 మంది అధికారులు, సిబ్బంది
– సున్నిత‌, అత్యంత సున్నిత కేంద్రాల్లో మైక్రో అబ్జ‌ర్వ‌ర్ల నియామ‌కం, వెబ్‌క్యాస్టింగ్‌
– డిస్ట్రిబ్యూష‌న్ కేంద్రాన్ని సంద‌ర్శించిన జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న తొలిదశ ఎన్నికల్లో జిల్లాలోని 73 గ్రామ పంచాయతీలు, 856 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు పేర్కొన్నారు.
క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ బుధ‌వారం విజ‌య‌వాడ రూర‌ల్‌కు సంబంధించి విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూష‌న్ కేంద్రాన్ని సంద‌ర్శించారు. ఎన్నిక‌ల సామ‌గ్రి పంపిణీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మీడియాతో మాట్లాడుతూ తొలిద‌శ‌లో విజ‌య‌వాడ రెవెన్యూ డివిజ‌న్‌కు సంబంధించి జి.కొండూరు మండ‌లంలో 22 గ్రామ పంచాయ‌తీల్లో 224 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న్నారు. ఇదేవిధంగా ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లంలో 10 గ్రామ పంచాయ‌తీల్లో 116 వార్డుల‌కు, మైల‌వ‌రం మండ‌లంలో 13 గ్రామ పంచాయ‌తీల్లో 154 వార్డుల‌కు, విజ‌య‌వాడ గ్రామీణ మండ‌లంలో 16 గ్రామ పంచాయ‌తీల్లో 226 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. తిరువూరు రెవెన్యూ డివిజ‌న్ రెడ్డిగూడెం మండ‌లంలో 12 గ్రామ పంచాయ‌తీల్లో 136 వార్డుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలిపారు. తొలిద‌శ ఎన్నిక‌ల‌కు 1,001 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటుచేశామ‌ని, ఉద‌యం 7 గంట‌ల నుంచి ఒంటిగంట వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని.. అదేవిధంగా మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి కౌంటింగ్ ఆపై ఫలితాల వెల్ల‌డి ఉంటుంద‌న్నారు. తొలిద‌శ‌కు సంబంధించి అయిదు గ్రామ‌పంచాయ‌తీ స‌ర్పంచ్ స్థానాలు ఏక‌గ్రీవ‌మ‌య్యాయ‌న్నారు. ఎన్నికల నిర్వహణకు సుమారు 9,000 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా శిక్ష‌ణ ఇచ్చిన‌ట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో ప‌టిష్ట భద్రతా చర్యలు ఉంటాయ‌ని, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకున్న‌ట్లు తెలిపారు. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు తావులేకుండా చూస్తున్నామ‌ని, సున్నిత‌, అత్యంత సున్నిత కేంద్రాల్లో 600 మంది మైక్రో అబ్జ‌ర్వ‌ర్లను నియ‌మించ‌డంతో పాటు వెబ్‌క్యాస్టింగ్‌కు కూడా ఏర్పాట్లు చేశామ‌న్నారు. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద సీసీ కెమెరాలు, వీడియోగ్ర‌ఫీతో నిరంత‌ర నిఘా, ప‌ర్య‌వేక్ష‌ణకు ఏర్పాట్లు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. కౌంటింగ్‌కు ఇబ్బందిలేకుండా నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రాతో పాటు అవ‌స‌ర‌మైన లైటింగ్ ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు.
ఉల్లంఘ‌న‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు:
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఘటనలను ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఎన్నిక‌ల‌కు సంబంధించి స‌మాచారం లేదా ఫిర్యాదుల‌కు క‌లెక్ట‌రేట్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) అందుబాటులో ఉంద‌ని, ఈ నంబ‌రులో సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను తదితరులు ఉన్నారు.