-ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు – ఐజీ మరియు కోఆర్డినేషన్ (రాష్ట్ర ఎన్నికల కమిషన్)బి. రాజకుమారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టిందని ఐజీ మరియు కోఆర్డినేషన్ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) బి. రాజకుమారి
తెలిపారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) ఉల్లంఘించేవారిపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటోందని ఆమె ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తును పటిష్టం చేశామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను అరికట్టేందుకు నిరంతర తనిఖీలు, నిఘా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ చేపట్టిన చర్యల వివరాలు
– నమోదైన ఎఫ్ఐఆర్లు – 607
– అరెస్టు అయిన వ్యక్తులు – 213
– జారీ చేసిన నోటీసులు – 1,785
– బైండోవర్ కేసులు (BNSS సెక్షన్లు 126/129 కింద) – 25,207
– బైండోవర్ చేసిన వ్యక్తులు – 1,41,687
– ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ఉల్లంఘన కేసులు – 37,942
– డిపాజిట్ చేసిన ఆయుధాలు – 9,337
– స్వాధీనం చేసుకున్న మద్యం – 3,548.4 లీటర్లు
ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటిస్తూ, ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనుకాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఐజీ రాజకుమారి కోరారు. ఎన్నికల నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు.
ఎక్కడైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, అక్రమ కార్యకలాపాలు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే సంఘటనలు చోటుచేసుకున్నట్లయితే వెంటనే పోలీసు శాఖకు సమాచారం అందించాలని, ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించాలని ఐజీ మరియు కోఆర్డినేషన్ (రాష్ట్ర ఎన్నికల కమిషన్) బి. రాజకుమారి విజ్ఞప్తి చేశారు.
