సాహసమే ఆయుధం.. అప్రమత్తతే రక్షణ..

– అస‌మాన విన్యాసాలతో ఆకట్టుకున్న ఆక్టోప‌స్ కమాండోలు
– పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్స‌వాల సందర్భంగా ప్రత్యేక ప్రదర్శన
– ఉగ్రవాద ముప్పులను ఎదుర్కొనేందుకు కమాండోల ప్రత్యేక శిక్షణా నైపుణ్యాల ప్రదర్శన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీస్‌కు చెందిన ప్రత్యేక ఉగ్రవాద నిరోధక దళం ఆక్టోపస్ (ఆక్టోప‌స్‌) ఆధ్వర్యంలో శుక్ర‌వారం విజయవాడలోని వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో ఓపెన్ హౌస్, ప్రత్యేక సామర్థ్య ప్రదర్శన నిర్వహించారు. ఆక్టోపస్ ఆపరేషన్స్ ఐజీ సీహెచ్ శ్రీకాంత్ ఐపీఎస్ సూచ‌న‌లు, దిశానిర్దేశంతో జ‌రిగిన ఈ కార్యక్రమం ద్వారా ఆక్టోపస్ ద‌ళ వృత్తిపరమైన నైపుణ్యం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం, నిరంతర శిక్షణ, క్రమశిక్షణ, సమన్వయం, ప్రజల భద్రత పట్ల దళానికి ఉన్న నిబద్ధతను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా ఉగ్రవాద దాడి, భవనంలో బందీలుగా ఉన్న వ్యక్తుల రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక దళాలు చేపట్టే చర్యలను అనుకరిస్తూ వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. భవనాలపైకి తాళ్ల సహాయంతో చేరుకోవడం, మాన్యువల్ క్లైంబింగ్, స్పీడ్ రాపెల్లింగ్, అబ్సైలింగ్, స్పైడర్ టెక్నిక్, వాల్ డ్రాప్, స్లైడింగ్ విత్ మిడిల్ డ్రాప్ వంటి ప్రత్యేక నైపుణ్యాలను కమాండోలు ప్రదర్శించారు. అలాగే, వాహనంలో బందీలుగా ఉన్న వ్యక్తులను రక్షించేందుకు చేపట్టే చర్యలను వివరించే సిమ్యులేటెడ్ సెడాన్ అసాల్ట్ ప్రదర్శన నిర్వహించారు. భవనాల్లో ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనే క్రమంలో ప్రత్యేక బృందాల సమన్వయం, వేగవంతమైన స్పందన, శిక్షణ మరియు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఈ ప్రదర్శనలు తెలియజేశాయి.
బాంబు నిర్వీర్యకరణ పరికరాల ప్రదర్శన:
ఆక్టోపస్ బాంబు నిర్వీర్యకరణ బృందం (బీడీడీఎస్‌) అనుమానాస్పద పేలుడు పదార్థాన్ని గుర్తించడం, పరిశీలించడం, సురక్షితంగా నిర్వీర్యం చేసే ప్రక్రియను ప్రదర్శించింది. ఈ సందర్భంగా రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ (ఆర్‌వోవీ/ఎంఆర్‌వోవీ), వాటర్ జెట్ డిస్రప్ట‌ర్ వంటి ప్రత్యేక పరికరాల వినియోగాన్ని వివరించారు. పేలుడు పదార్థాల నిర్వీర్యకరణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సురక్షిత విధానాలు మరియు శిక్షణ పొందిన సిబ్బంది పాత్రను ఈ ప్రదర్శన ద్వారా తెలియజేశారు.
క్లోజ్ క్వార్టర్ కాంబాట్, కే9 ప్రదర్శన: కమాండోలు క్లోజ్ క్వార్టర్ కాంబాట్ (Combatives)కు సంబంధించిన నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ కే9 డాగ్స్ ద్వారా అడ్డంకులను అధిగమించడం, హ్యాండ్లర్లతో సమన్వయం మరియు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలకు సంబంధించిన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలు పోలీస్ సిబ్బంది, ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కల మధ్య ఉన్న సమన్వయం, నైపుణ్యం, నిరంతర సాధన యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పాయి. ఆక్టోపస్ దళం గతంలో నిర్వహించిన వివిధ ఆపరేషన్లతో పాటు జాతీయ స్థాయి పోటీల్లో కూడా తన ప్రతిభను చాటుకుంది. 2013లో చిత్తూరు జిల్లాలో జరిగిన ఆపరేషన్ పుట్టర్, 2025లో రాయచోటి వద్ద నిర్వహించిన బాంబు నిర్వీర్యకరణ చర్యలు, విజయవాడలో నిర్వహించిన ఆపరేషన్ రెడ్ వెబ్ వంటి ఘటనలను కార్యక్రమ ప్రసంగంలో ప్రస్తావించారు.
అదేవిధంగా, జాతీయ స్థాయి స్నైపర్ పోటీలు, నేషనల్ జాయింట్ కౌంటర్ టెర్రరిస్ట్ ఎక్సర్‌సైజ్, జాయింట్ కౌంటర్-IED ఎక్సర్‌సైజ్‌లలో ఆక్టోపస్ సాధించిన విజయాలు మరియు అంతర్జాతీయ స్థాయి పోలీస్ ఫైరింగ్ పోటీల్లో సాధించిన పతకాలను కూడా వివరించారు.
ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యం:
ఆక్టోపస్ నిర్వహించిన ఈ ఓపెన్ హౌస్ మరియు సామర్థ్య ప్రదర్శన ద్వారా విద్యార్థులకు ప్రత్యేక పోలీస్ దళాల విధులు, ఉగ్రవాద నిరోధక చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలు మరియు ఆధునిక పరికరాల వినియోగం గురించి అవగాహన కల్పించారు. నిరంతర శిక్షణ, క్రమశిక్షణ, ధైర్యం, సమన్వయం, వృత్తిపరమైన నైపుణ్యాలే ప్రత్యేక దళాల సామర్థ్యానికి పునాదులని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. ప్రజల భద్రతను పరిరక్షించడం, ఉగ్రవాద ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడం మరియు అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో స్పందించడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆక్టోపస్ దళం నిరంతరం సిద్ధంగా ఉంటుందని కార్యక్రమం ద్వారా తెలియజేశారు.