గుంటూరులో దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక నియంత్రణ కార్యక్రమం చేపట్టినట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.
కమిషనర్ ఆదేశాల మేరకు బయాలజిస్ట్ శేషయ్య పర్యవేక్షణలో శుక్రవారం మలేరియా విభాగం సిబ్బంది వార్డుల వారీగా ప్రత్యేక పారిశుద్ధ్య, దోమల నివారణ కార్యక్రమం నిర్వహించారు. వర్షాల కారణంగా ఏర్పడిన నీటి నిల్వలు, డ్రైనేజీలు, కాలువలు, కల్వర్టులు, ఖాళీ స్థలాలు, ఇతర దోమల ఆవాసాలను గుర్తించి నిర్మూలించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, దోమల నియంత్రణలో భాగంగా యాంటీ లార్వల్ ఆపరేషన్లు నిర్వహిస్తూ లార్వా దశలోనే దోమలను నిర్మూలిస్తున్నట్లు తెలిపారు. నీటి నిల్వ ప్రాంతాలు, మురుగు కాలువలు, నిర్మాణ ప్రదేశాలు, ఇళ్ల పరిసరాలను పరిశీలించి లార్వా నిర్మూలన చర్యలు చేపడుతున్నామన్నారు.
నగరంలోని చెరువులు, పెద్ద ఖాళీ స్థలాలు, కాల్వల్లో డ్రోన్ ఆధారిత యాంటీ లార్వల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ల వినియోగంతో విస్తృత ప్రాంతాలను తక్కువ సమయంలో కవర్ చేయడంతో పాటు సిబ్బంది చేరుకోలేని ప్రదేశాల్లోనూ దోమల నియంత్రణ చర్యలు చేపట్టేందుకు వీలవుతుందన్నారు.
దోమల సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, మార్కెట్లు, కాలనీలు, ప్రజాసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కల్వర్టులు, డ్రైనేజీ మార్గాలు, చీకటి, తేమతో కూడిన ప్రాంతాల్లో దోమల ఆవాసాలను నివారించేందుకు ప్రత్యేకంగా కల్వర్ట్ ఫాగింగ్ చేపడుతున్నామన్నారు.
ప్రజలు కూడా దోమల నివారణలో భాగస్వాములు కావాలని కమిషనర్ సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ప్లాస్టిక్ కంటైనర్లు, పూల కుండీలు తదితర నీటి నిల్వ పాత్రలను వారానికి ఒకసారి శుభ్రం చేయాలని కోరారు. దోమతెరలు వినియోగించాలని, జ్వరం వచ్చిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.