ముంబై వరల్డ్ మేయర్స్ ఫోరంలో CITYNET ప్రతినిధులతో గుంటూరు కమిషనర్ భేటీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ముంబైలో జరుగుతున్న ‘3వ వరల్డ్ మేయర్స్ ఫోరం’లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ CITYNET ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె. పట్టాభిరామ్, ఇతర కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ శతాబ్ది ఉత్సవాలు (1926–2026) సందర్భంగా నవంబర్ 25 నుంచి 27 వరకు ముంబైలోని ఫెయిర్‌మాంట్ హోటల్‌లో ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు.
సమావేశంలో నగరాల మధ్య పరస్పర సహకారం, పట్టణ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, సుస్థిర పట్టణాభివృద్ధి తదితర అంశాలపై CITYNET ప్రతినిధులతో చర్చించారు. పట్టణ సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన ఆధునిక విధానాలు, ఉత్తమ పద్ధతులపై అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ ఫోరంలో వివిధ దేశాలకు చెందిన మేయర్లు, పట్టణ పాలనా నిపుణులు, విధాన నిర్ణేతలు పాల్గొని ఆధునిక నగరాల భవిష్యత్తుపై చర్చించారు. 2047 నాటికి నగరాల పునరాకృతి, కృత్రిమ మేధ ఆధారిత పట్టణ పాలన, వ్యర్థాల నిర్వహణ, సర్క్యులర్ ఎకానమీ, వాతావరణ స్థితిస్థాపకత, సుస్థిర పట్టణ రవాణా, మెట్రోపాలిటన్ గవర్నెన్స్, ఇంధన పరివర్తన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా నాయకత్వం, లింగ సమానత్వం, ఆర్థిక చేరికపై ప్రత్యేక వర్క్‌షాప్ కూడా నిర్వహించారు.
అంతర్జాతీయ సదస్సులో చర్చించిన ఉత్తమ విధానాలు, నూతన ఆలోచనలను గుంటూరు నగరంలో అమలు చేసేందుకు కృషి చేస్తామని నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ, కమిషనర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రజలకు మరింత సమర్థవంతమైన పట్టణ సేవలు అందించడం లక్ష్యంగా ఈ అనుభవాలను వినియోగించుకుంటామని తెలిపారు.