భక్త కనకదాస జీవితం నేటి తరానికి ఆదర్శనీయం..

– జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తత్వజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే రీతిలో కీర్త‌న‌లు, రచనల ద్వారా అందించిన ప్రముఖ తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త భక్త కనకదాస జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
భక్త కనకదాస జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హాజరై కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కనకదాస రచించిన రామధ్యాన చరిత్ర, మోహన తరంగిణి వంటి ప్రముఖ రచనలు విశేష ప్రాచుర్యం పొందాయన్నారు. ఆయన జీవితాన్ని, బోధనలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపడంలో భక్త కనకదాస రచనలు ఎంతో దోహదపడతాయని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఇ.జ‌గ్గ‌య్య తదితరులు పాల్గొన్నారు.