స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి

-రిసెప్షన్ సెంటర్లు, పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
-భద్రత, బారికేడింగ్, సీసీ కెమెరాలు, విద్యుత్ సదుపాయాలు, సిబ్బంది రాకపోకలకు ప్రత్యేక మార్గాలపై అధికారులకు సూచనలు

జగ్గయ్యపేట / నందిగామ / మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా జగ్గయ్యపేట ఎస్.జి.ఎస్ కళాశాల యూజీసీ బ్లాక్, కంచికచర్ల, మార్కెట్ యార్డ్, కొండపల్లి జెడ్పీ పాఠశాల తదితర ప్రాంతాల్లో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా రిసెప్షన్ సెంటర్లు, పోలింగ్ స్టేషన్లు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ హాళ్లను రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత భవన సముదాయాలు, వాటి ప్రాంగణాలు, కౌంటింగ్ హాళ్లు, గదుల్లో చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. కౌంటింగ్ లేదా స్ట్రాంగ్ రూములుగా వినియోగించనున్న గదుల్లో నేలపై ఏర్పాటు చేసిన నంబర్డ్ గ్రిడ్లు, మార్కింగ్‌లను పరిశీలించి, కౌంటింగ్ ప్రక్రియకు అనువుగా ఏర్పాట్లు ఉండేలా తగిన సూచనలు చేశారు. భవన ప్రాంగణంలో బారికేడింగ్, టేబుళ్ల ఏర్పాటు, సిబ్బంది విధుల నిర్వహణకు అవసరమైన స్థలం, రాకపోకలకు అనువైన మార్గాలపై అధికారులతో చర్చించారు. కౌంటింగ్ హాళ్లలో ఒక్కో విభాగం, వరుసకు అవసరమైన టేబుళ్ల సంఖ్య, టేబుళ్ల మధ్య ఉండాల్సిన దూరం, అధికారులు, సిబ్బంది సులభంగా రాకపోకలు సాగించేందుకు అవసరమైన మార్గాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ క్రమంలో అధికారులు సిద్ధం చేసిన లేఅవుట్ మ్యాప్‌లు, నివేదిక పత్రాలను పరిశీలిస్తూ గదుల కొలతలు, ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ ద్వారాలు, భద్రతాపరమైన అంశాలను అంచనా వేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లు, కౌంటింగ్ హాళ్లు ఉన్న ప్రాంగణాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ప్రాంగణాల్లో తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన ఇతర సౌకర్యాలను ముందుగానే గుర్తించి, వాటి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్ట్రాంగ్ రూముల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ ద్వారం స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రతాపరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అలాగే భవనాల చుట్టూ, కౌంటింగ్ కేంద్రాల లోపల బారికేడింగ్, ఫెన్సింగ్ ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత ప్రాంతాల్లో భద్రతా నియంత్రణకు అనువుగా ఏర్పాట్లు ఉండేలా పోలీస్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కౌంటింగ్ హాళ్లలోకి ప్రవేశించే కౌంటింగ్ అధికారులు, సిబ్బంది, ఏజెంట్ల కోసం వేర్వేరు ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. రాకపోకల సమయంలో రద్దీ ఏర్పడకుండా, విధుల నిర్వహణకు ఆటంకం కలగకుండా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసి, భద్రత, మౌలిక సదుపాయాలు, కౌంటింగ్ హాళ్ల లేఅవుట్ వంటి అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ సందర్భంలో నందిగామ ఆర్డీవో
జి.అనిల్ కుమార్, విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను, జగ్గయ్యపేట తహసిల్దార్ ఎస్.శిరీష, మున్సిపల్ కమిషనర్ దుర్గాప్రసాద్, ఎంపీడీవో అరుణ, కంచికచర్ల తహసిల్దార్ నరసింహారావు, ఇబ్రహీంపట్నం తహసిల్దార్ శ్రీనివాసమూర్తి, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.