65వ డివిజన్‌లో వైసీపీ నాయకుల విస్తృత ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 65వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్ అభ్యర్థి పసుపులేటి లక్ష్మి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చుట్టుగుంట సెంటర్ నుంచి ఎస్‌ఆర్ఆర్  కాలేజీ పరిసర ప్రాంతాల వరకు గడపగడపకు వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకుంటూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు పరిశీలించి తేడాను గుర్తించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించాలని వారు తెలిపారు. ముఖ్యంగా మహిళలు గత ప్రభుత్వంలో అందించిన సేవలను, చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించాలని కోరారు. 65వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పసుపులేటి లక్ష్మిని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, మేయర్ రాయన భాగ్యలక్ష్మికి కూడా తమ మద్దతు అందించాలని ప్రజలను అభ్యర్థించారు.
అనంతరం 65వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పసుపులేటి లక్ష్మి మాట్లాడుతూ, తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డివిజన్‌లోని స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా, వీధి విద్యుత్ దీపాలు తదితర సమస్యలపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని, మేయర్ రాయన భాగ్యలక్ష్మికి కూడా మద్దతు తెలిపి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు.
ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.