– ఆటో డెబిట్ అయితే తిరిగి లబ్ధిదారునికి చెల్లించాలి
– బాధితులను కష్టాల నుంచి గట్టెక్కించడంలో బ్యాంకర్లు భాగస్వాములుకండి
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా ముంపునకు గురై సర్వం కోల్పోయిన నివాసితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని.. ఇలా జమచేసిన సొమ్మును లబ్ధిదారునికి అప్పటికే ఉన్న రుణం కింద ఎట్టిపరిస్థితుల్లోనూ జమచేయొద్దని.. ఒకవేళ ఆటో డెబిట్ ద్వారా అడ్జెస్ట్ జరిగి ఉంటే లబ్ధిదారున్ని స్వయంగా పిలిచి ఆర్థిక సహాయం మొత్తాన్ని నగదు రూపంలో నేరుగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ సృజన బ్యాంకు అధికారులకు సూచించారు.
శుక్రవారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లీడ్ జిల్లా కార్యాలయం ఆధ్వర్యంలో కలెక్టర్ సృజన 9వ జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వరదల కారణంగా జిల్లాలో ముంపునకు గురైన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించి, నేరుగా డీబీటీ ద్వారా వారి ఖాతాల్లో జమచేస్తున్నట్లు ఆమె తెలిపారు. దాదాపు నష్టపోయిన 90 వేల కుటుంబాలతో పాటు వ్యాపార, వాణిజ్య ఆస్తి నష్టాలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని పారదర్శకంగా లబ్ధిదారులకు అందించేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నట్లు ఆమె తెలిపారు. లబ్ధిదారులు బ్యాంకుల నుంచి ఇప్పటికే ఏవిధమైన రుణాలునైనా తీసుకొని ఉంటే జమచేసిన ఆర్థిక సహాయాన్ని రుణం కింద జమచేసుకోవద్దని సూచించారు. సర్వంకోల్పోయి ఎన్నో ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఈ విషయంలో బ్యాంకుల భాగస్వామ్యం అవసరమన్నారు. జమచేసిన సొమ్ము ఆటోమేటిక్‌గా రుణ తిరిగి చెల్లింపు కింద కట్ అయినట్లు గుర్తిస్తే ఆయా బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు సమాచారమందించి, తిరిగి వారికి నగదు రూపంలో ఆర్థిక సహకారాన్ని అందించి వారు ఇబ్బందుల నుంచి బయటపడేయడంలో సహకరించాలని కలెక్టర్ సృజన బ్యాంకు అధికారులకు సూచించారు. దీనిపై కలెక్టర్ సూచనలను పరిగణనలోకి తీసుకొని తప్పనిసరిగా ఆర్థిక సహాయం బాధితులకు అందేలా చర్యలు తీసుకుంటామని, లబ్ధిదారులకు సహకరించడంలో బ్యాంకర్లు ముందుంటామని తెలిపారు.
సమావేశంలో ఎల్‌డీవో పీఎం పూర్ణిమ, సమావేశ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) రీజనల్ హెడ్ ఎం.శ్రీధర్, ఎల్‌డీఎం కె.ప్రియాంక, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.