Breaking News

రాజీ మార్గమే రాచ మార్గం.. లోక్ అదాలత్ చక్కని వేదిక… : జిల్లా జడ్జి జి. రామకృష్ణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజీ మార్గమే రాచ మార్గమని, రాజీ కుదుర్చుకునే అవకాశాలున్న కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మెన్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామకృష్ణ సూచించారు. శనివారం న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ, కృష్ణాజిల్లాలో 90 వేల కేసులకు పైగా వివిధ కోర్టులలో పెండింగు దశలోనే ఉన్నాయని , వాటిలో 13 వేల 344 కేసులు రాజీ చేసుకోవడానికి ముందుకు వచ్చిన కేసులుగా తాము గుర్తించామన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయం,డబ్బు వృధా చేసుకోకూడదనే ఉద్దేశంతో లోక్ అదాలత్ లు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నా యన్నారు. అయితే ఈ లోక్ అదాలతో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వహణ కేసులు, వైవాహిక సంబంధమైన కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు, బ్యాంక్ రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ చేయదగ్గ కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా జడ్జి తెలిపారు. ప్రధానంగా ఈ లోక్ అదాలత్ పెద్ద మనసుతో క్షమించి రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కారమయ్యే విధంగా చూస్తుందని అన్నారు. సివిల్ తగాదాలో రాజీ మార్గం ద్వారా పరిష్కారమైతే కోర్టు ఫీజు కూడా వెనుకకు తీసుకునే అవకాశముందని ఆయన తెలిపారు. దీనిని కక్షిదారులు న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంకులు, విద్యుత్, తదితర అధికారులు, ప్రజలు మరింతగా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పట్టు విడుపు ధోరణులతో స్నేహ పూరిత వాతావరణంలో ఒకరినిఒకరు క్షమించుకొనే మనస్వత్వంతో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. తగాదాలు పడనీ బార్యాభర్తలే ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండరని, మాట మాటా రావడం ఎంతో సహజమని వాటినే తీవ్రంగా పరిగణించి గొడవలు పడి పచ్చని సంసారాన్ని చిన్నాభిన్నం చేసుకొని దంపతులు విడాకులు తీసుకొని విడిపోయేందుకు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం ఎంత మాత్రం తగదని ఆయన అన్నారు. మానవ స్వభావం లో సహజంగా ఉండే ‘ నేను ‘ ‘ నా మాట నెగ్గాలి ‘ అనే అహంకారపూరిత ధోరణులే అత్యధిక వివాదాలకు ముఖ్య కారణమన్నారు. సారీ..క్షమించు..తప్పు చేశా..దయచేసి మన్నించు … అనే మాటలు కుటుంబ బాంధవ్యాన్నీ తిరిగి నిలబెడతాయన్నారు. న్యాయవ్యవస్థ, పోలీసులతో అవసరం లేనివిధంగా ప్రశాంతమైన జీవనం గడపడం పౌరునికి ఒక భాగ్యం అని జిల్లా జడ్జి పేర్కొన్నారు. కక్షిదారులు చిన్నచిన్న కేసుల కోసం సమయాన్ని వృధా చేసుకోకుండా కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్ అదాలత్ ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే కోర్టు ఫీజులను కూడా తిరిగి పొందవచ్చన్నారు. లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్, సివిల్, వివాహ, కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్, బ్యాంకు, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ సంబంధ కేసులను, రాజీ పడదగు ఇతర కేసులు పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంకు, చిట్ ఫండ్ అధికారులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నతమ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించుకొని లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని కోరారు. కోర్టు ల్లో లేని కేసులను ప్రీ లిటిగేషన్ ద్వారా న్యాయసేవాధికార సంస్థలో పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రీ-లిటిగేషన్ విషయాల్లో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిని సంప్రదించాలన్నారు. అలాగే, ఇన్సూరెన్స్, బ్యాంక్, చిట్ ఫండ్ కేసుల పరిష్కారం కోసం ఏవైనా సలహాలు, సూచనలు కావాల్సి వస్తే న్యాయ సేవాధికార సంస్థను నేరుగా సంప్రదించి ఉచిత సలహాలు పొందవచ్చునని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎ.నరసింహమూర్తి , తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జి కె. సీతా రామకృష్ణారావు, పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ ఛైర్మెన్ డాక్టర్ ఎం. రామకృష్ణ, కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. రాజారామ్ , మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె. మెహర్ ప్రసాద్, మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి, మచిలీపట్నం డి ఎస్పి మసూమ్ బాషా, రాబర్ట్సన్ పేట, చిలకలపూడి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు రుద్రరాజు భీమరాజు, రాజులపాటి అంకబాబు, పలువురు సీనియర్ న్యాయవాదులు, కక్షిదారులు ఇన్సురెన్స్ కంపెనీల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం

-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్‌ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *