మహిళా సాధికారతకు బ్యాంకుల ప్రోత్సాహం అత్యంత కీలకం….

-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వయం సహాయక సంఘాల మహిళల సమగ్ర వికాసానికి, గ్రామీణ మహిళా సాధికారతకు బ్యాంకులు అందిస్తున్న ఆర్థిక సహకారం ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా పేర్కొన్నారు.

విజయవాడ పున్నమి ఘాట్‌లో జరుగుతున్న జాతీయ సారస్ ఆజీవిక మేళా–2026లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన “సంవాద్ టు సమృద్ధి – ఎస్‌హెచ్‌జీ రుణాల నుంచి లక్షపతి దీదీ వరకు” ముఖాముఖి సదస్సులో ఆయన ప్రసంగించారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు, సూక్ష్మ వ్యాపారాలను బలోపేతం చేసుకునేందుకు బ్యాంకింగ్ రంగం నిరంతర తోడ్పాటు అందించాలని సూచించారు. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరుస్తూ స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.

​కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ NRLM జాతీయ సమన్వయకర్త అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎస్‌హెచ్‌జీ–బ్యాంక్ రుణాల అనుసంధానంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని, ఢిల్లీ వెలుపల తొలిసారిగా జాతీయ సరస్ మేళాను ఏపీలో నిర్వహించడం గర్వకారణమని తెలిపారు.

అనంతరం యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 5 లక్షలకు పైగా సంఘాలకు రూ.33,212 కోట్ల రుణాలు అందించామని, ‘యూనియన్ లక్షపతి దీదీ పథకం’ కింద అర్హులైన మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నామని వివరించారు.

సదస్సులో ఏజీఎంలు మహేష్, శ్రీనివాస్, డిఆర్ డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాంచార రావు, అదనపు డైరెక్టర్ వై. రమ స్వయం సహాయక సంఘాలు పాల్గొన్నారు.