నవంబర్ 16వ తేదీ నుంచి ఎరువుల పంపిణీకి నూతన విధానం అమలు

-ఎఫ్.ఎఫ్.ఎస్ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్, కొనుగోళ్లు
-రైతులు ముందుగానే ఏపీఎఫ్ఆర్ లో వివరాలు నమోదు చేసుకోవాలి
-జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్.తిరుమలాదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ (FFS) నూతన విధానాన్ని ఎన్‌టీఆర్ జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్. తిరుమలాదేవి తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు సంచాలకుల ఆదేశాల మేరకు ప్రస్తుతం అమలులో ఉన్న ఏపీఏఐఎంఎస్ యాప్ స్థానంలో ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం ఇప్పటికే కృష్ణా, కాకినాడ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు తెలిపారు.

ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో ముందస్తు బుకింగ్ తప్పనిసరి

రైతులు తమకు అవసరమైన ఎరువులను ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇందుకు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్, ఆధార్ నంబర్ లేదా ఫార్మర్ ఐడీ, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ అవసరం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బుకింగ్‌కు ముందు ఏపీఎఫ్ఆర్ లో రైతుల నమోదు తప్పనిసరి. రైతులు స్వయంగా లేదా గ్రామస్థాయి వ్యవసాయ సిబ్బంది సహకారంతో నమోదు చేసుకోవచ్చు.
ఆధార్ లేదా ఫార్మర్ ఐడీ ద్వారా ఓటిపి ధృవీకరణ పూర్తయిన తర్వాత ఏపీఎఫ్ఆర్ లో నమోదైన భూముల వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. నమోదు కాని భూముల వివరాలను కూడా యాప్‌లో చేర్చుకునే అవకాశం ఉండగా, రైతు సేవా కేంద్రం సిబ్బంది వాటిని పరిశీలించి ఆమోదిస్తారు. కౌలు, వారసత్వ, అటవీ పట్టాలు, దేవాలయ, ప్రభుత్వ తదితర భూములకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించారు. రైతులు భూమి విస్తీర్ణం, పంట వివరాలు నమోదు చేసిన తర్వాత సిఫార్సు చేసిన ఎరువుల పరిమాణం యాప్‌లో కనిపిస్తుంది. ఇందులో యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంప్లెక్స్ ఎరువుల వివరాలు ఉంటాయి. యూరియా, డీఏపీ సిఫార్సు పరిమాణాల్లో మార్పు ఉండదు. ఇతర ఎరువుల ఎంపికలో రైతులకు వెసులుబాటు ఉంటుంది.
రైతులు రాష్ట్రంలో ఎక్కడైనా లేదా పొరుగు రాష్ట్రాల్లోనైనా తమకు అనుకూలమైన ఎరువుల దుకాణాన్ని ఎంపిక చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ పూర్తయిన తర్వాత ప్రతి దుకాణానికి ప్రత్యేక క్యూఆర్ కోడ్, టోకెన్ నంబర్ జారీ అవుతాయి. క్యూఆర్ కోడ్‌ను వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఇతరులకు పంపించుకోవచ్చు. రైతు తరఫున మరొకరు ఎరువులు కొనుగోలు చేయాలనుకుంటే వారి ఆధార్, మొబైల్ వివరాలు నమోదు చేయాలి. క్యూఆర్ కోడ్ జారీ అయిన 48 గంటల్లోపు ఎరువులు కొనుగోలు చేయాలి. ఆ గడువులో కొనుగోలు చేయని బుకింగ్‌లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయి. కొనుగోలు సమయంలో డీలర్‌కు క్యూఆర్ కోడ్ చూపిస్తే, e-POS యంత్రం ద్వారా స్కాన్ చేసి ఎరువులు అందజేస్తారు. బుక్ చేసిన పరిమాణం కంటే తక్కువ కొనుగోలు చేయవచ్చు కానీ ఎక్కువ కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు.

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌లు
భూముల వివరాలకు సంబంధించి వివాదాలు తలెత్తినప్పుడు మండల వ్యవసాయ అధికారి ద్వారా పరిష్కరించే వెసులుబాటు కల్పించారు. ప్రతి ఎరువుల దుకాణంలో రైతుల సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు, క్షేత్రస్థాయి పర్యవేక్షణకు ఎంఏఓ., విఏఏ., లాగిన్లను అందుబాటులో ఉంచారు.

ఎరువుల పంపిణీలో పారదర్శకత పెంచడంతో పాటు, రైతులకు సులభంగా ఎరువులు అందించడమే ఎఫ్ఎఫ్ఎస్ విధానం ప్రధాన ఉద్దేశమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. కావున రైతులందరూ ముందుగానే ఏపీఎఫ్ఆర్ లో తమ వివరాలు నమోదు చేసుకొని, ఆధార్‌కు మొబైల్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది సూచనలు పాటిస్తూ నూతన విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.