-విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి
-పర్యావరణ పరిరక్షణ, నెట్ జీరో లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.
-ప్రభుత్వ కార్యదర్శి ముదావత్ ఎం.నాయక్
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త:
నేటి బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పోషకాహారం ఎంతో కీలకమని, చిన్న వయస్సు నుంచే విద్యార్థులు మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి ముదావత్ ఎం. నాయక్ సూచించారు.
నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నందిగామ మండలం ముప్పాళ్లలోని డా.బి.ఆర్.అంబేద్కర్ బాలికలు గురుకులంలో నిర్వహించిన బాలల పోషకాహార తోటల పండుగ (Child Nutri-Garden Festival) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విత్తనాలు నాటి, మొక్కలు నాటడం ద్వారా పోషకాహార తోటను ప్రారంభించారు. విద్యార్థినులు స్వయంగా కూరగాయలు, ఆకుకూరలు, పోషక విలువలు కలిగిన మొక్కలను పెంచడం ద్వారా తాజా, సహజమైన ఆహారాన్ని పొందవచ్చని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో పోషకాహారంపై అవగాహన పెంచడంతో పాటు, ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. నెట్ జీరో కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ కర్బన ఉద్గారాలను తగ్గించడం, మొక్కలను విరివిగా పెంచడం, నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, పరిసరాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని, విద్యార్థులు తమ ఇళ్లలో, పాఠశాలల్లో పర్యావరణహిత అలవాట్లను పాటిస్తూ ఇతరులకు కూడా ఆదర్శంగా నిలవాలని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి పర్యావరణ పరిరక్షకులని, ప్రకృతి వనరులను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన వాతావరణాన్ని అందించగలమని ప్రభుత్వ కార్యదర్శి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం వంటి చిన్న చిన్న చర్యలతో పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఎన్.తేజ్ భరత్, అదనపు కార్యదర్శి పద్మావతి, నెట్ జీరో ఎస్.పి.డి శరవణన్, కృష్ణా జిల్లా డిసివో టి.మురళీకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
