పుస్తక పఠన సంస్కృతిని ప్రోత్సహించాలి…

-37వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయండి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
37వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పిలుపునిచ్చారు.

శనివారం ప్రధాన కార్యదర్శి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన 37వ విజయవాడ పుస్తక మహోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యత, విజ్ఞానాభివృద్ధిలో పుస్తకాల పాత్ర, సమాజంలో పఠన సంస్కృతిని విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.

పుస్తక పఠనం వ్యక్తుల జ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనా దృక్పథాన్ని విస్తృతం చేస్తుందని, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి పుస్తక మహోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పుస్తకాలు విజ్ఞాన సముపార్జనకు, సామాజిక చైతన్యానికి, సృజనాత్మక ఆలోచనలకు కీలకమైన ఆధారాలని పేర్కొన్నారు.

విజయవాడ పుస్తక మహోత్సవం పాఠకులు, రచయితలు, ప్రచురణకర్తలు, సాహితీప్రియులకు ఒక విశిష్ట వేదికగా నిలుస్తోందని పేర్కొంటూ, ఈ మహోత్సవంలో ప్రజలు విస్తృతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

37వ విజయవాడ పుస్తక మహోత్సవం 2027 జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ పుస్తక మహోత్సవం కోఆర్డినేటర్ ఎమ్మెస్కో. విజయకుమార్, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు టి. మనోహర్ నాయుడు, కార్యదర్శి కె. లక్ష్మయ్య పాల్గొన్నారు.