గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని, విస్తరణ పూర్తి అయిన ప్రాంతంలో రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను, అంకిరెడ్డిపాలెంలో హిందూ శ్మశాన వాటిక వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత చుట్టగుంట సెంటర్ నుండి కంకరగుంట ఆర్యుబి వరకు ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించి, మాట్లాడుతూ ఏటి అగ్రహారం విస్తరణ పనులు వేగంగా జరిగేలా పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కొన్ని భవనాలు అంగీకారం తెలిపినందున వాటిని, రోడ్ పక్కన డ్రైన్ ముందుకు వచ్చిన ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. విద్యుత్ స్తంభాలు షిఫ్ట్ చేయాలని సిపిడి సిఎల్ ఏఈ ని ఆదేశించారు. రోడ్ క్లియర్ గా ఉన్న ప్రాంతంలో నూతన రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటికే విస్తరణ పనుల జాప్యం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులు వేగంగా జరిగేలా కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని డిఈఈని ఆదేశించారు. అనంతరం అంకిరెడ్డిపాలెం హిందూ శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, వాకింగ్ ట్రాక్ లో మరుగుదొడ్లు లేవని వాకర్స్ ఫిర్యాదు మేరకు బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్న మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావడానికి బోర్ వెల్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో సిటి ప్లానర్ రాంబాబు, ఎస్.ఈ. నాగ మల్లేశ్వరరావు, ఈఈ కోటేశ్వరరావు, ఏసిపి వెంకటేశ్వరరావు, డిఈఈలు మధుసూదనరావు, సతీష్ కుమార్, శ్రీనివాసరావు, ఆర్.ఓ. రెహ్మాన్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News