-తల్లి తండ్రులకు ఆర్పీ సిసోడియా పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పుస్తక పఠనం అలవాటు చేసే బాధ్యతను తల్లి తండ్రులు తీసుకోవాలని రెవిన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. పుస్తకాలు మంచి నేస్తాల వంటివని, వాటి సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో శుక్రవారం నిర్వహించిన దక్షిణ పశ్చిమ కవి సమ్మేళనంకు కవి, రచయిత, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిసోడియా విభిన్న కవితల సారాంశాన్ని వివరిస్తూ మనుషులందరూ ఒకేలా ఉన్నప్పుడు భిన్న మతాలకు వేర్వేరుగా దేవుడు ఎందుకు ఉన్నాడన్నారు. ఆచార వ్యవహారాల్లో మతం పేరుతో ఉన్న అంతరాలు, భేధాలు ఎందుకున్నాయని ప్రశ్నించారు.
హిందూ,ముస్లిం వ్యక్తులు ఆరాధనకు వేరు వేరు మందిరాలకు వెళ్తారు కాని మధుశాలకు మాత్రం కలిసే వెళతారని ఒకే విధమైన గ్లాసులో ఒకే బార్ మధ్యం సేవిస్తారంటూ హరి వంశరాయ్ బచ్చన్ చెప్పిన కవితను ఉదహరించారు. మనిషిని మనిషిగా చూడకుండా, ఒకరాయిని దేవుడు అని చెప్పటం, ఆరాయిని చూసి భయపడటం ఏమిటి? అని ఒక కవిగా ప్రశ్నించారు. మత గ్రంధాలను దేవుడు రాయలేదని, అందుకే అవి సత్య దూరంగా ఉన్నాయని వాటిని మనలాంటి మనుషులే రాసి శాసనాలుగా చెబుతున్నారని రచయితగా తన తన భావజాలాన్ని వెల్లడించారు. దీనివల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటున్నాయని సిసోదియా వివరించారు. సమాజంలో మనిషి కంటే రాయికే విలువెక్కువ ఉందని అన్ని మత గ్రంధాలలో సత్యాసత్యాలు కూలంకషంగా చర్చించాలన్న మీర్జా గాలిబ్ ,హరి వంశరాయ్ బచ్చన్ సాహిత్యాన్ని ఉదాహరణగా వివరించారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు కవులు పాల్గొన్నారు.