– బాల్య వివాహాల దుష్పరిణామాలపై పెద్దఎత్తున అవగాహన కల్పించాలి
– బాలికల విద్య, ఆర్థిక సాధికారతపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్య వివాహ రహిత భారత్ కోసం ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందని.. సమష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన బాల్య వివాహ రహిత భారత్ (బాల్య వివాహ ముక్త్ భారత్) ప్రచార కార్యక్రమం అమల్లో భాగంగా బాల్య వివాహాల నిషేధ అధికారుల(సీఎంపీవో)తో జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దురాచారమని, అది బాలికలను విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటంకం కలిగించడమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని వివరించారు. అందువల్ల సమాజంలోని ప్రతిఒక్కరూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా వీలైనంత మేర ప్రయత్నం చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిణామాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులకూ అవగాహన కల్పించాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసిన చట్టాలు, ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, విధానాల పటిష్ట అమల్లో మహిళాభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యం, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బాలికల విద్య, ఆర్థిక సాధికారతపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు విద్య అనేది కీలకమని, విద్యతో పాటు సాధికారత కల్పించడం ద్వారా పేదరికాన్ని తద్వారా బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలను దూరం చేయొచ్చని పేర్కొన్నారు.
బాల్య వివాహం.. మానవ హక్కుల ఉల్లంఘన:
బాల్య వివాహం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని, ఈ నేపథ్యంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తానని, నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం, సమాజంలో బాల్యవివాహాలు జరక్కుండా చూస్తానని, బాల్య వివాహానికి చేసే ఏ ప్రయత్నాన్నయినా గ్రామ పంచాయతీ, ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తానని, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్, బాల్య వివాహ రహిత భారత్ కోసం నా గళాన్ని వినిపిస్తానంటూ కలెక్టర్ లక్ష్మీశ ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కడా ఒక్క బాల్య వివాహం కూడా జరక్కుండా సీఎంపీవోలు అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించారు.
సమావేశంలో నోడల్ అధికారి సీహెచ్ సాయిగీత, వాసవ్య మహిళామండలి ప్రెసిడెంట్ డా. కీర్తి బొల్లినేని, విజయవాడ రూరల్ సీడీపీవో జి.మంగమ్మ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం.రాజరాజేశ్వరరావు, సీఎంపీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, సీడీపీవోలు, ఏఎస్ఐలు, సూపర్‌వైజర్లు తదితరులు హాజరయ్యారు.