-జి.కొండూరు మండలంలో సి.సి.రోడ్లు, గోకులం షెడ్లు ప్రారంభం
-ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
-గంగినేని పాలెం లో సంక్రాంతి సంబరాలు ప్రారంభం
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జి.కొండూరు నుంచి దుగ్గిరాల పాడు రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. రహదారి సరిగ్గా లేకపోవటం వల్ల ఈ మార్గంలో వచ్చే బస్సు సర్వీసు నిలిచి పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జి.కొండూరు దుగ్గిరాల పాడు రహదారి నిర్మించి ఈ మార్గంలో బస్సు సర్వీసు పునరుద్దరించేందుకు కృషి చేస్తానని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలోని దుగ్గిరాల పాడు,గంగినేని పాలెం, తెల్లదేవరపాడు, చెరువు మాధవరం గ్రామాల్లో సిసి రోడ్లు, గోకులం షెడ్లు ప్రారంభోత్సవ కార్యక్రామనికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిధి హాజరై, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాథ్ కు జి కొండూరు మండల గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు..
ముందుగా గోగినేని పాలెం, దుగ్గిరాల పాడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గంగినేని పాలెం లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. సంక్రాంతి ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. సున్నంపాడు గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించుకున్న రోడ్లు, గోకులం షెడ్లు సంక్రాంతికి ఒకరోజు ముందు ప్రారంభించటం ఎంతో ఆనందంగా వుందన్నారు. ఒక రోజు ముందుగానే సంక్రాంతి పండుగ గ్రామాలకు వచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఆనందం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సిసి రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతులు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జి.కొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు కూడా రహదారి నిర్మాణ పనులు ఎంపి కేశినేని శివనాథ్ సహకారంతో అతిత్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అలాగే గంగినేని గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లు కూడా పూర్తి చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ నీటికుళాయి పథకంకు నిధులు మంజూరు చేస్తామన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమం రెండుకళ్ళుగా ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నుంచి తల్లికి వందనం పథకంను కూడా అమలు చేస్తామని అన్నారు. అనంతరం గంగినేని గ్రామంలో ఎంపి కేశినేని శివనాథ్ తో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
ఈకార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, జి.కొండూరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకయ్య, జనసేన మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు అక్కల గాంధీ, గంగినేని పాలెం మాజీ సర్పంచ్ మంగళం పాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎ.ఎమ్.సి చైర్మన్ ఉయ్యూరు వెంకట నరసింహరావు , కిలారి సాంబశివరావు లతోపాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.