-పరిశుభ్రత మెరుగుపడాలి అంటున్న ప్రజలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత మూడు నెలల్లో ప్రభుత్వాసుపత్రుల పట్ల పలు అంశాల్లో ప్రజల్లో సానుకూలత మరింతగా బలపడినట్లు తాజా ఐ.వి.ఆర్.యస్ సర్వే వెల్లడించింది. ఈ విషయంలో ఈ ఏడాది జనవరి 27,ఫిబ్రవరి 7, మార్చ్ 5 మరియు తాజాగా ఏప్రిల్ 7న ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు ప్రభుత్వాసుపత్రుల పట్ల ప్రజాభిప్రాయంపై ఐ.వి.ఆర్.యస్ సర్వేఫలితాలను సోమవారం నాడు సమీక్షించారు.
డి.యమ్.ఇ పర్యవేక్షణలో ఉన్న 32, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో ఉన్న 242 ప్రభుత్వాసుపత్రులకు సంబంధించి జనవరి నుంచి ఐ.వి.ఆర్.యస్ ద్వారా నాలుగు సార్లు ప్రజాభిప్రాయసేకరణ జరిగింది.
డి.యమ్.ఇ ఆసుపత్రిలలో జనవరి సర్వేలో 66 శాతం ప్రజలు డాక్టర్, సిబ్బంది అందుబాటులో ఉన్నారని తెలపగా తాజా సర్వే నాటికి ఈ విషయంలో ప్రజాభిప్రాయం 12.33 శాతం అదనంగా బలపడి సానుకూలత 74.14 శాతానికి పెరిగింది. డాక్టర్ వ్రాసిన మందులు ఇచ్చే అంశంపై సానుకూలత 57 శాతం నుండి 18.65 శాతం పెరిగి తాజాగా 67.63 శాతంగా నమోదు అయింది. జనవరి సర్వేలో ఆసుపత్రులలో అవినీతి ఉందన్న ప్రజలు 63 శాతం నుండి 34 శాతానికి పైగా తగ్గగా తాజా సర్వేలో 41.17 శాతం మాత్రమే అవినీతిని గమనించామని వెల్లడించారు.
సెకండరీ ఆసుపత్రులకు సంబంధించి కూడా పై విషయాల్లో సానుకూలత పెరిగింది. డాక్టర్, సిబ్బంది అందుబాటుపై జనవరి సర్వేలో 58 శాతం మాత్రమే
సానుకూలంగా స్పందించగా తాజా సర్వే నాటికి అది 27 శాతం పెరిగి 74 శాతం ప్రజలు సానుకూలంగా స్పందించారు. అవినీతిని గమనించమన్నవారి సంఖ్య 61 శాతంనుండి 41 శాతానికి పడిపోయింది. డాక్టర్ వ్రాసిన మందులు ఇస్తున్నరన్నా వారి సంఖ్య 59 శాతం నుండి తాజాగా 79 శాతానికి పెరిగింది.
అయితే డి.యమ్.ఇ మరియు సెకండరీ ఆసుపత్రులలో పారిశుధ్యంపై ప్రజలు పెదవి విరిచారు. డి.యమ్.ఇ ఆసుపత్రులలో పరిశుభ్రత బాగానే ఉందన్నవారు జనవరి సర్వేలో 60 శాతం ఉండగా తాజాగా అది 49 శాతానికి పడిపోయింది. సెకండరీ ఆసుపత్రులకు సంబంధించి ఇది 67 శాతం నుండి 50 శాతానికి పడిపోయింది.