-జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో పారిశుద్ధ్య పనులను ఫిర్యాదులు రాకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, కమిషనర్(F.A.C) పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ లో పూర్ పెర్ఫార్మన్స్ ఉన్న మఠం వీధి సహా పలు ప్రాంతాలలో సోమవారం నగర ఆరోగ్యశాఖాధికారి వినూత్నతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో ఎన్ని గృహాలు ఉన్నది.? ఎంత మంది పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ మరియు సైడ్ డ్రెయిన్ల నిర్వహణ విధానాన్ని పరిశీలించి సిబ్బందికి పలు ఆదేశాలిచ్చారు. ఇంటింటికి చెత్త సేకరణ నూరుశాతం జరగాలన్నారు. వారానికొకసారి ప్రతి వీధిలో పూడికతీత పనులు చేపట్టాలని, డ్రైనేజీ కాలువలపై ఆక్రమణలు ఉంటే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమన్వయం చేసుకుని తొలగించాలని ఆదేశించారు. డ్రైనేజీ కాలువల్లో పైపులు, ఇతరత్రా ఆటంకాలు ఉంటే ఇంజనీరింగ్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొలగించాలని సూచించారు. ఇకపై ప్రతివారం ఐవీఆర్ఎస్ జరుగుతుందని.. కావున పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు కూడా వ్యక్తిగతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటేనే నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా సూచించారు. నగరంలోని ప్రతిఒక్కరికీ ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు.
Prajavartha Online Telugu News