ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
-సమష్టి కృషితో వర్సిటీ విలువలు కాపాడదాం
-వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ
-నన్నయ వర్సిటీలో యాంటీ ర్యాగింగ్ వీక్

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఇతరులను ఇబ్బందికి గురిచేయాలని, బాధపెట్టాలనే మానసిక రుగ్మతే ర్యాంగింగ్ అని, ర్యాగింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. మంగళవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ హాజరై విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. జ్యోతి ప్రజ్వలన చేసి, నన్నయ విగ్రహానికి పూలమాల వేసి యాంటీ ర్యాగింగ్ వీక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మమేకం కావడం ఎంతో ఆనందంగా ఉందని, విద్యార్థులకు చట్టలపై అవగాహన కల్పించడానికి, విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు. విద్యాలయాలలో చక్కని ఆనందకరమైన వాతావరణం ఉండాలని, దానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. సీనియర్ విద్యార్థులు మీ జూనియర్లకు ఆదర్శప్రాయులుగా ఉండాలన్నారు. మీ మార్గదర్శకత్వం వారి విద్యా ప్రయాణాన్ని రూపొందిస్తుందని చెప్పారు. భయం ద్వారా కాదు, స్నేహం ద్వారా ముందుకు సాగాలన్నారు. కలుపుగోలుతనం, పరస్పర గౌరవం యొక్క సంస్కృతిని పెంపొందించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. తన జీవితంలో ఎదురైన సమస్యలను అధిగమించి తాను చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్న నేపథ్యాన్ని విద్యార్థులకు వివరించి స్ఫూర్తిని నింపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, అందరి కుటుంబ నేపథ్యం ఒకే విధంగా ఉండవని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉన్నత విద్యలో రాణించాలన్నారు. అలాగే ర్యాగింగ్ కు పాల్పడిన వారికి విధించే శిక్షలు, చట్టాలపై అవగాహన కల్పించారు. లైంగిక నేరాల నుండి చిన్నారులకు రక్షణ కల్పించే భారతీయ చట్టాలలో పోక్సో చట్టం ఎంతో కీలకమైనదని అన్నారు. 2012 నుండి ఈ చట్టం అమలు లోనికి వచ్చిందని, పోక్సో చట్టం ద్వారా లైంగిక వేదింపులపై మరింత కఠినమైన చర్యాలు ఉంటాయని హెచ్చరించారు. భారతీయులంతా నా సహోదరులు అంటూ చిన్నతనంలో చేసిన ప్రతిజ్ఞను జీవితమంతా గుర్తుపెట్టుకొని ఆనందంగా జీవించాలని సూచించారు.

వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు యాంటీ ర్యాగింగ్ వీక్ ను నిర్వహిస్తున్నామని, నూతనంగా విశ్వవిద్యాలయంలో ప్రవేశించే విద్యార్థులకు చక్కని వాతావరణాన్ని నెలకొల్పుతున్నామని చెప్పారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం జ్ఞానం, ఐక్యత మరియు గౌరవానికి ఒక దీపస్తంభంగా నిలుస్తుందని, విలువలను నిలబెట్టడం మా సమిష్టి విధి అని పెర్కొన్నారు. ర్యాగింగ్ అనేది ఒక ఆచారం కాదని, భారతీయ చట్టం మరియు యూజిసి నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరమని చెప్పారు. యూజీసీ ర్యాగింగ్‌ను అరికట్టడంపై నిబంధనలు (2009) మరియు భారత సుప్రీంకోర్టు ఆదేశాలు బహిష్కరణ, జరిమానాలు మరియు క్రిమినల్ అభియోగాలు వంటి కఠినమైన చర్యలను ఆదేశించిందన్నారు. విశ్వవిద్యాలయంలో భౌతికంగా, మౌఖికంగా లేదా డిజిటల్‌గా ఏ రూపంలోనైనా ర్యాగింగ్‌ను సహించేది లేదని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ, స్క్వాడ్స్ హాస్టళ్లు, తరగతి గదులు మరియు సాధారణ ప్రాంతాలను చురుకుగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దుష్ప్రవర్తనను అరికట్టడానికి సీసీటీవీ నిఘా మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. యాంటీ ర్యాగింగ్ వారంలో భాగంగా ఎవరిని ర్యాగింగ్ చేయను అని సభలో ఉన్నవారు అందరితో వీసీ ప్రతిజ్ఞ చేయించారు. విశ్వవిద్యాలయంలోని వారంతా ఒకే కుటుంబంగా ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు సహకరించాలని తెలియజేశారు.

అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ను వీసీ సాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆచార్య ఎన్ ఉదయభాస్కర్, యూనివర్సిటీ లీగల్ ఆఫీసర్ నందెపు నాగేంద్రరావు, సీనియర్ అడ్వకేట్ వెంట్రప్రగడ ఉమామహేశ్వరి, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *