-ఇన్స్పెక్టర్ పి.వి. సూర్య మోహన్
-చదువుతో బంగారు భవిష్యత్తు
-జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్. అనంత ప్రదీప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నషా ముక్త్ భారత్ అభియాన్ (మాదక ద్రవ్యల నిర్మూలన) కార్యక్రమంలో భాగంగా, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఈగల్ డిపార్ట్మెంట్, ప్రభుత్వ హాస్పిటల్ డి-అడిక్షన్ సెంటర్ మరియు పుస్కారమాత డ్రగ్ ఎడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం వద్ద విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈగల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి.వి. సూర్య మోహన్ మాట్లాడుతూ, “భారతదేశాన్ని మత్తు పదార్ధాల రహిత దేశంగా తీర్చిదిద్దడం ప్రతి పౌరుడి బాధ్యత” అని పేర్కొన్నారు. మత్తు పదార్ధాలకు బానిసలైన వారిని వెంటనే కౌన్సిలింగ్ కోసం డి-అడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్లాలని సూచించారు. మాదక ద్రవ్యాల రవాణా లేదా విక్రయం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 1972 నంబర్‌కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఆర్. అనంత ప్రదీప్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలగాలని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో చైతన్యం పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా, ఉన్నత విద్యతో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని, భావితరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
కార్యక్రమంలో విద్యార్థులతో మత్తుపదార్ధాల వ్యతిరేక నినాదంతో ప్రతిజ్ఞ చేయించడం, నషా ముక్త్ భారత్ అభియాన్ గోడపత్రికల ఆవిష్కరణ జరిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, ఈగల్ టీమ్, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది, పుస్కారమాత ఆర్గనైజేషన్ సభ్యులు, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News