Breaking News

ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం బ్యారేజీ లో వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ చాంబర్ నుండి వరద పరిస్థితులపై క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ ఎగువన భారీ వర్షాల కారణంగా ప్రకాశం నిన్న రాత్రి నుండి కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజ్ లోకి 2.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం పైనుంచి వస్తుందన్నారు. ఈ ప్రవాహం ఈరోజు సాయంత్రానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్నారు. మొదటి స్థాయి హెచ్చరిక కూడా ప్రకటించే అవకాశం ఉందన్నారు. బుడమేరు నదికి 5 నుంచి 10 వేల క్యూసెక్కులు వరద నీరు వదులుతున్నారన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంత మండల అధికారులు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండి కాలువల పటిష్టతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

తహసిల్దారులు, ఎంపీడీవోలు, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా జల వనరుల శాఖ ఇంజనీర్లు,సిబ్బంది కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో కాలువలు నిరంతరం గస్తీ చేస్తూ వరద ప్రవాహ పరిస్థితిని గమనించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులు వారి కిందిస్థాయి సిబ్బందికి వరదల పర్యవేక్షణ పై సూచనలు జారీ చేయాలన్నారు.
గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. నదిలో ఎవరు కూడా ఈతకు వెళ్లకుండా పర్యవేక్షించాలన్నారు. జిల్లాస్థాయిలో నిరంతరం పనిచేసే ఒక కంట్రోల్ విభాగాన్ని 08672 252572 నంబర్తో ఏర్పాటు చేశామని ఎవరైనా ప్రజలు గాని సిబ్బంది గానీ వరదలకు సంబంధించిన సమాచారాన్ని లేదా ఇబ్బందులను తెలియజేయవచ్చన్నారు. వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా అధికారుల వాట్స్అప్ గ్రూపులలో పంపడం జరుగుతుందని, అది గమనించుకుంటూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

గత సంవత్సరం సంభవించిన వరదలను, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బుడమేరు నదీ పరివాహక ప్రాంతంలో పనిచేస్తున్న అధికారులందరూ చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో వరదలు గుడివాడ డివిజన్లో అధికంగా వచ్చినందున ముఖ్యంగా గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి వరద పరిస్థితులపై సంపూర్ణ పర్యవేక్షణ చేయాలన్నారు. ముఖ్యంగా ఎక్కడైనా కాలువలు బలహీనంగా ఉండి దెబ్బ తినే ప్రమాదం ఉంటే ముందుగానే గుర్తించి వాటి పటిష్టతకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. గుడివాడ, ఉయ్యూరు, మచిలీపట్నం ఆర్డీవోలు నోడల్ అధికారులుగా వ్యవహరించి వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, విపత్తుల నిర్వహణ జిల్లా మేనేజర్ బి నారాయణ, మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు ఆర్డివోలు, తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, జల వనరుల శాఖ ఇంజనీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *