రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరి గట్టున ఉన్న నల్లా ఛానెల్ వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. గురువారం ఉదయం ఆయన కూటమి నాయకులతో కలిసి నల్లా ఛానెల్‌ను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీట మునిగే లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. నల్లా ఛానెల్ వద్ద ఉన్న నీటిని తోడే మోటార్లు మొరాయించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే హై పవర్ మోటార్లు ఏర్పాటు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వరదలు వస్తే నగరంలో నీట మునిగే ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. శాసన సభ్యులు వెంట నగర పాలక సంస్థ అధికారులు, కూటమి నాయకులు, తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News