-నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సీసీ) ప్రత్యేక శిబిరంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-యువతను క్రమశిక్షణగల వ్యక్తులుగా, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్ సీసీ పాత్రను కొనియాడిన మంత్రి దుర్గేష్
-దేశ నిర్మాణం పట్ల ఐక్యత, బాధ్యతను పెంపొందించుకోవాలని సూచన
-సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో ఎన్ సీసీ జాతీయ సమైక్యత ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్న మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీలో సాంస్కృతిక రాజధానిగా విలసిల్లుతున్న రాజమహేంద్రవరంలో జాతీయ సమైక్యత, సంస్కృతి, సంప్రదాయాల పట్ల యువతలో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్ చెరువులో ఉన్న శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ లో నిర్వహిస్తున్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సీసీ) జాతీయ సమైక్యత ప్రత్యేక శిబిరంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలోని యువతను క్రమశిక్షణ, దేశభక్తి, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్ సీసీ చేస్తున్న కృషిని మంత్రి దుర్గేష్ కొనియాడారు.
ఈ సందర్భంగా ఎన్ సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించిన మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా వారితో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి దుర్గేష్ ఆసక్తిగా తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.విభిన్న జాతులు, మతాలు, భాషలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు, సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనం భారతదేశమన్నారు. భిన్నత్వంలో ఏకత్వం తమ విధానం అన్నారు.విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన విభిన్న వ్యక్తులు కలిసిన చోటు ఈ కార్యక్రమం అన్నారు.
విద్యార్థి దశ నుండే జాతీయ సమైక్యతను పెంపొందించుకొని సోదర భావంతో మెలగాలని మంత్రి దుర్గేష్ క్యాడెట్లకు సూచించారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారిని, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ తదితర దేశరక్షణకు సంబంధించిన సర్వీస్ లలో శిక్షణ అందజేస్తుండటం గొప్ప అవకాశంగా భావించాలన్నారు. ఇందులో చేరిన ప్రతి ఒక్కరికీ భవిష్యత్ లో అద్భుతమైన అవకాశాలు కలుగుతాయన్నారు
ఎన్ సీసీ అద్భుతమైన ఆర్గనైజేషన్ అని కొనియాడారు. ప్రతి స్కూల్, కాలేజీ విద్యార్థి ఎన్ సీసీ ద్వారానే క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాలు నేర్చుకుంటారన్నారు. ఎన్ సీసీలో చేరి శిక్షణ పొందే వారికి భవిష్యత్ లో మంచి అవకాశాలు ఇస్తుందన్నారు. ఇక్కడ పొందే శిక్షణా కార్యక్రమాల ద్వారా విభిన్న కోణంలో ఆలోచించగలుగుతామన్నారు.మాతృభూమికి ఏం చేయాలో ఇక్కడ నేర్పిస్తారన్నారు. దేశానికి సేవ చేసే భాగ్యం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. బాధ్యత గల దేశ పౌరుడిగా తీర్చిదిద్దేందుకు ఎన్ సీసీ ఆర్గనైజేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పహల్గాం దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయం సాధించిందని, తద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారతదేశం తమ సైనిక సత్తాను ప్రపంచానికి చూపించిందని మంత్రి దుర్గేష్ వివరించారు.
ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూడిన ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతోందన్నారు. తాము రాజకీయాల్లో ఉన్న వ్యక్తులమని, తాము ప్రజాసేవ చేయగలమన్నారు. తాను పాఠశాల దశలో ఉన్నప్పుడు ఎన్ సీసీలో చేరానని తనకు క్రమశిక్షణ అలవడింది ఇక్కడే అని మంత్రి దుర్గేష్ గుర్తుచేసుకున్నారు.
Prajavartha Online Telugu News