-పాడైన మెట్ల మార్గం, డ్రెయిన్స్ మరియు రోడ్లుకు తగిన మరమ్మతులు చేపట్టాలి.
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి , కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్-3 పరిధిలోని 6వ డివిజన్ కొండ ప్రాంతాలతో పాటుగా పలు విధులలో బుధవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ మరియు అధికారులతో కలసి పర్యటించి డివిజన్ లో సమస్యలను పరిశీలించారు. కార్పొరేటర్ తెలిపిన పలు సమస్యలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలను చేసారు.
నిమ్మతోట సెంటర్ మెట్రో ప్రాంతములో అనధికార ఆక్రమణలను తొలగించి గ్రీనరి అభివృద్ధి పరచాలన్నారు. అదే ప్రాంతములోని లోడర్ పాయింట్ అక్కడ నుండి వేరొక ప్రదేశానికి మార్చాలని సూచించారు. డివిజన్ పరిధిలోని కొండ ప్రాంతాలైన తోట వారి విధి, గంగానమ్మ గుడి రోడ్, వినాయక గుడి రోడ్ మొదలగు వీధులలో పాడైన డ్రెయిన్లు, మెట్ల మార్గం మరియు రోడ్లకు తగిన మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా వినాయక గుడి రోడ్ నందలి పాడైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజి పాత పైపు లైన్ స్థానంలో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని అన్నారు. పలు చోట్ల రోడ్డు కంటే పల్లంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రెయినేజి మ్యాన్ హోల్స్ ఎత్తు పెంచాలని అధికారులకు సూచించారు.
డివిజన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ విధానమును పరిశీలించి మెరుగైన పారిశుధ్య నిర్వహణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొండ పై ప్రాంతములో స్థానికులను ప్రతి రోజు చెత్త సేకరణకు సిబ్బంది వస్తున్నది, లేనిది, త్రాగు నీటి సరఫరా విధానము అడిగితెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేస్తూ, చెత్త మరియు వ్యర్ధములు డ్రెయిన్లలో పడవేయకుండా అనువైన ప్రదేశాలలో డస్ట్ బిన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి మున్సిపల్ స్కూల్ నందలి వసతులు మరియు కిచిన్ రూమ్ లను పరిశీలించి పలు సూచనలు చేసారు.
పర్యటనలో కార్పొరేటర్ వియ్యపు అమరనాథ్, చీఫ్ మెడికల్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్ర శేఖర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రంగారావు, పాత్రుడు, హెల్త్ ఆఫీసర్ డా.శ్రీదేవి, ఇతర అధికారులు శానిటరీ / ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.