-పరిస్థితిని జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది
-ఫిర్యాదులకై హెల్ప్‌లైన్ నెంబర్ 9494060060 ను సంప్రదించవచ్చు
-కలెక్టర్ కీర్తి చేకూరి
-ప్రజలు సంయమనం పాటించాలి: ఎస్పీ డి. నరసింహ కిషోర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు భయాందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వై జంక్షన్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చౌడేశ్వరినగర్, స్వరూప్‌నగర్ ప్రాంతాల్లో కిడ్నీ సంబంధిత కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని తెలిపారు. జిల్లా పరిపాలన, వైద్య ఆరోగ్య, ఆహార భద్రత, పోలీసు, రెవెన్యూ, పశుసంవర్థక శాఖలు మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ప్రతిస్పందన బృందాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
డయాలసిస్ అవసరమైన మూత్రపిండ సమస్యలతో ఇప్పటివరకు 12 మంది నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరగా, వీరందరికీ ఒకే పాలవ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆ వ్యాపారి పాలు సరఫరా చేసిన 106 ఇళ్లలోని కుటుంబాలకు రక్తపరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. వీరందరికీ నిరంతర పర్యవేక్షణతో తగిన వైద్యసేవలు అందిస్తామని స్పష్టం చేశారు.
పశుసంవర్థక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి నమూనాలను వైజ్ఞానిక మరియు పశుసంవర్థక శాఖ ప్రయోగశాలలకు పంపినట్లు తెలిపారు. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు తదితర పాల ఉత్పత్తులను హైదరాబాద్ మరియు విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపినట్లు వెల్లడించారు. నివేదికలు అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పందించి, ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై సమగ్ర నివేదికను కోరినట్లు కలెక్టర్ తెలిపారు. బాధితులకు అత్యుత్తమ వైద్యసేవలు అందించడంతో పాటు, మూల కారణాలను త్వరితగతిన గుర్తించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజల్లో అపోహలు వ్యాపించకుండా సమగ్ర అవగాహన కల్పించాలని, అవసరమైన అన్ని వనరులు వినియోగించాలన్న దిశగా సూచనలు అందించినట్లు చెప్పారు.
కాబట్టి ప్రజలు భయాందోళన చెందవద్దని, అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్ 9494060060 ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఈ కేసులకు సంబంధించి హెల్త్ బుల్లెట్ ను అధికారికంగా విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ… ఇప్పటివరకు నాలుగు మరణాలు సంభవించినట్లు వెల్లడించారు. మృతులు ఎన్. శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74), తాడి కృష్ణవేణి (76), తాడి రమణి (58)గా తెలిపారు. ఈ మరణాలకు సంబంధించిన మృతదేహ పరీక్షా నివేదికలు రావాల్సి ఉన్నట్లు చెప్పారు. అనధికారికంగా నిర్వహిస్తున్న డెయిరీని సీజ్ చేసి పాలవ్యాపారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కారణాలు స్పష్టమైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన రక్త నమూనాల ఆధారంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఎక్కువగా ప్రభావితమైనట్లు గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు కొన్ని రోజులు బాగా మరిగించిన పాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… అనారోగ్యానికి గురైన వారిలో వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఆదివారం రాత్రి నుంచి రక్త నమూనాల సేకరణ కొనసాగుతోందన్నారు. సమీక్ష సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. పి.వి.వి. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News