-బాలికా విద్యతోనే సమాజ మార్పు
-తూర్పు గోదావరి జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా ప్రతి మహిళ జీవితంలో ఆచరణలో ఉండాల్సిన అంశమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా కొన్నిచోట్ల మహిళలు వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ విద్య, ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక స్వావలంబన ద్వారా వాటిని అధిగమించవచ్చని తెలిపారు.
ముఖ్యంగా బాలికా విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొన్నారు. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని, కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితే దేశం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. అందువల్ల ఆడపిల్లల పెళ్లి, బంగారం కోసం ఖర్చు చేసే డబ్బును వారి విద్య కోసం కేటాయిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరని పేర్కొన్నారు. తన జీవితాన్ని కూడా ఉదాహరణగా ప్రస్తావిస్తూ మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు ఎంతో ముందుకు వెళ్తారని చెప్పారు.
మహిళా సాధికారతకు డొక్కా సీతమ్మను ఒక గొప్ప ఉదాహరణగా కలెక్టర్ అభివర్ణించారు. కుల, మత విభేదాలు అధికంగా ఉన్న కాలంలో కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి మానవత్వానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు. మహిళ తన జీవితానికి అవసరమైన లక్ష్యాలను స్వయంగా నిర్ణయించి వాటిని సాధించగల శక్తి వచ్చిన రోజునే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అటువంటి స్థితి వచ్చినప్పుడు మహిళా దినోత్సవం నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ప్రతి రంగంలో మహిళలు తమ వంతు భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా చాటుకుంటున్నారని తెలిపారు. గ్రామస్థాయిలో సర్పంచ్ పదవి నుంచి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పారిశ్రామిక వేత్తలు, జిల్లా కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల వరకు మహిళలు తమదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాంటి మహిళలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. తన ఎదుగుదలలో కూడా పలువురు మహిళల ప్రేరణ ఉందని, ముఖ్యంగా తన తల్లి, జీవిత భాగస్వామి, స్నేహితులు మరియు స్కూల్ సమయంలో మ్యాథ్స్ టీచర్ జయశ్రీ మేడమ్ ప్రోత్సాహం ఎంతో కీలకమని తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలకు మ్యాథ్స్‌ను ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకోవడానికి ఆమె ఇచ్చిన ధైర్యమే కారణమని, నేడు ఐఏఎస్ అధికారిగా నిలవడానికి వారి ప్రేరణ ఎంతో తోడ్పడిందన్నారు. కలెక్టరేట్లో సెక్షన్ సూపరింటెండెంట్ల నుంచి సిబ్బంది వరకు అనేక మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని, వారి ప్రతిభ, పనితనం ఎంతో నమ్మకం కలిగించేలా ఉందని చెప్పారు. ఏ పని అప్పగించినా అర్ధరాత్రి అయినా స్పందిస్తూ బాధ్యతతో నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్ష భావన పూర్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ సమాజ సమగ్రాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు కుటుంబం, సమాజం అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నదని, పరిశ్రమల స్థాపనకు రుణ సదుపాయాలు, సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెటింగ్ సహాయం వంటి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల దశ నుంచే ఆడపిల్లల పట్ల గౌరవంగా ఎలా ప్రవర్తించాలో మగపిల్లలకు బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు.
రూడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ మహిళా శక్తికి వందనాలు తెలియజేశారు. జిల్లాలో అత్యున్నత పరిపాలనా పదవిలో కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నారని, రాజకీయ రంగంలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఉన్నారని పేర్కొన్నారు. ఆధునిక ప్రజా జీవితంలో అధికారిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలతో పాటు న్యాయ, పోలీసు తదితర రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే భారం అనే భావన ఉండేదని, నేడు ఆడపిల్ల భరోసా అనే స్థాయికి సమాజం చేరుకుందని చెప్పారు. బాలికల చదువుపై అవగాహన పెరగడంతో డ్రాప్ అవుట్లు తగ్గాయని పేర్కొన్నారు. మహిళల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, బాలురా బాలిక అనే వివక్ష భావనను సమాజం పూర్తిగా విడనాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు స్పూర్తిదాయక ప్రసంగాలు చేయగా, విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకల్లో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి. శ్రీదేవి, మహిళా అధికారులు పి. భాగ్యవతి, బి.కె.ఎన్. జ్యోతి, నాతి బుజ్జి, వి. శాంతామణి, వి. పార్వతి, పి. వీణాదేవి, శైలజావల్లి, వి. వినూత్న తదితరులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా భారీ స్థాయిలో రుణాల చెక్కులను పంపిణీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఇన్నిస్పేట బ్రాంచ్ ద్వారా బ్యాంక్ లింకేజ్, LHP, CSS, PMSV, స్విమ్స్ పథకాల కింద రూ.424,06,50,000 (నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల ఆరు లక్షల యాభై వేల రూపాయలు) విలువైన రుణాల చెక్కులు స్వయం సహాయక సంఘ సభ్యులకు అందజేశారు. అలాగే డి.ఆర్.డి.ఎ – సెర్చ్ బ్యాంక్ లింకేజ్ మరియు స్త్రీనిధి పథకాల ద్వారా 75,650 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాజమహేంద్రవరం మెయిన్ రోడ్ బ్రాంచ్ ద్వారా రూ.1,016,00,00,000 (ఒక వెయ్యి పదహారు కోట్ల రూపాయలు) రుణాల చెక్కులను పంపిణీ చేసి మహిళల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూర్చారు.
Prajavartha Online Telugu News