-దత్త పీఠంలో మరకత రాజరాజేశ్వరీ దేవి ఆశీస్సులు అందుకున్న ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పటమట దత్త నగర్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో శ్రీ దత్త పీఠం అర్చకులు, ఆశ్రమ పర్యవేక్షకులు, అవధూత రమేష్, ఎగ్జిక్యూటివ్ ఏయస్ఆర్ కె. ప్రసాద్, ట్రస్టు మెంబరు జివి. ప్రసాద్, ఇతర ట్రస్టు మెంబర్లు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట యంపి విజయసాయిరెడ్డి, టిటిడి ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డి ఆశ్రమానికి వచ్చారు. తొలుత ఆశ్రమంలోని సుప్రగణపతి, శ్యామకమలలోచన దత్తాత్రేయ, మరకత శ్రీ రాజరాజేశ్వరి దేవి, గంగాధరేశ్వర స్వామి, శ్రీమాతే నామకోటి మండపం, కార్యసిద్ధి హనుమాన్ ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా హనుమాన్ ఆలయంలో పూర్ణఫలాన్ని తాకి చేతికి రక్షకంకణం కట్టుకున్నారు. అనంతరం అవధూత దత్త పీఠాధి పతి స్వామి గణపతి సచ్చిదానంద స్వామిని ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి కలిసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, సియం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, యంయల్ సిలు యండి. కరీమున్నీసా, టి. కల్పలతా రెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కొలుసు పార్ధసారధి, కె. రక్షణనిధి, కైలే అనీల్ కుమార్, జడ్ పి ఛైర్మన్ ఉప్పాల హారిక, నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, కెడిసిసిబి ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. జి. వాణిమోహన్, సమాచార శాఖ కమిషనరు టి. విజయకుమార్ రెడ్డి, నగర పోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టరు డా. కె. మాధవిలత, సబ్ కలెక్టరు జి.యస్.యస్. ప్రవీణ్ చంద్, ఏసిపి హర్షవర్ధన్ రాజు, వైయస్ఆర్ సిపి నాయకులు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, యార్లగడ్డ వెంకట్రావు, తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డితో సమావేశానంతరం అవధూత గణపతి సచ్చిదానందస్వామి మీడియాతో మాట్లాడుతూ అందరినీ భయభ్రాంతులను చేసిన కరోనాను నియంత్రించేందుకు అందరూ నిబంధనలు పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అర్చకులు సంతోషంగా ఉన్నారన్నారు. హిందూ ధర్మపరిరక్షణకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారన్నారు. ప్రభుత్వం పై కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం తగదని అన్నారు. ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రిని కోరానన్నారు. వంశపారంపర్య అర్చకులను కొనసాగించాలని కోరగా అందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి సానుకూలంగా స్పందించారని గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు.