-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-తూళ్లూరు అమరజీవి స్మృతివనంలో మంత్రి పర్యటన
-58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహ ఏర్పాట్ల పరిశీలన
-ఈ నెల 16న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ
-భారీగా తరలొస్తున్న జనాలు
-ఏర్పాట్లలో అలసత్వం చూపొద్దు : మంత్రి సవిత ఆదేశం
తుళ్లూరు/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరజీవి పొట్టి శ్రీరాముల ప్రాణ త్యాగం వృథా కానివ్వబోమని, ఆంధ్రజాతి కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న లక్ష్యంతోనే పొట్టి శ్రీరాముల స్మతివనం ఏర్పాటుచేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత తెలిపారు. పొట్టి శ్రీరాముల 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల అమరజీవి కాంస్య విగ్రహాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు సభ్యులు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రాజధాని అమరావతిలోని తుళ్లూరు లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్న పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహ ఏర్పాటు పనులను మంత్రి సవిత శనివారం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు పనులు ఎంతవరకూ వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నానికే విగ్రహాన్ని సిద్ధం చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు సభ్యులకు సూచించారు. అనంతరం స్మృతివనం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభ స్థలి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణకు ప్రజలు భారీ ఎత్తున తరలి రానున్నారని, ఏర్పాట్లలో అలసత్వం చూపొద్దని దిశా నిర్దేశం చేశారు. ఎవ్వరికీ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సవిత స్పష్టంచేశారు. సాధారణ, వీఐపీ గ్యాలరీల ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ నామకరణంతో 58 అడుగుల ఎత్తు మేర ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ విగ్రహాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు సభ్యులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమరజీవి 58 రోజుల అమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను, త్యాగాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ నెల 16వ తేదీన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు పాల్గొనబోతున్నారన్నారు. బీసీ ఆత్మ గౌరవం నిలిపేలా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తోందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
రూ.3 లక్షల విరాళాలు
తుళ్లూరులో ఏర్పాటు చేస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహ ఏర్పాటుకు ముగ్గురు ఆర్యవైశ్య సామాజి వర్గీయులు రూ.లక్ష చొప్పున రూ.3 లక్షలను మంత్రి సవితకు అందజేశారు. విరాళాలు అందజేసని కొత్తూరు గంగాధర్, నాగుబండి ప్రకాశ్ రావు, కె.వెంకటేశ్వరరావును మంత్రి సవిత అభినందించారు. అనంతరం శ్రీమద్భగవద్గీత హ్యాండ్ బుక్ ను మంత్రి సవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్టు సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News